350కి పైగా చావులు.. ఇంకా 200 మంది మిస్సింగ్..​ వయనాడ్‌లో ఐదో రోజూ సహాయక చర్యలు

350కి పైగా చావులు.. ఇంకా 200 మంది మిస్సింగ్..​ వయనాడ్‌లో ఐదో రోజూ సహాయక చర్యలు

తిరువనంతపురం: వయనాడ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లు తుది దశకు చేరాయని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. శనివారం ఉదయం తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వయనాడ్ విపత్తులో ఇప్పటివరకూ 215 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో 87 మంది మహిళలు, 98 మంది పురుషులు, 30 మంది పిల్లలు ఉన్నారు.

148 డెడ్ బాడీలను కుటుంబసభ్యులకు అప్పగించాం. ఇంకా 206 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. విపత్తులో గాయపడిన 81 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు” అని సీఎం వెల్లడించారు. చలియార్ నదిలో బండరాళ్లు, చెట్ల దుంగల మధ్య నుంచి వెలికితీసిన మృతదేహాలు, శరీర భాగాలు బాగా దెబ్బతినడంతో గుర్తించడం కష్టంగా మారిందన్నారు.

ఇంకా 67 మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఫైర్, ఫారెస్ట్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఆర్మీ, వాలంటీర్ గ్రూప్ లకు చెందిన 1,419 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. బాధితులకు పునరావాసం కోసం సురక్షితమైన స్థలాన్ని ఎంపిక చేసి, ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. స్కూళ్లు కూడా ధ్వంసం అయినందున.. బాధిత కుటుంబాల పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. కాగా, మృతుల సంఖ్య శనివారం సాయంత్రానికి 358కి పెరిగినట్టు అనధికారికంగా వెల్లడైంది.   

ఐదో రోజూ ముమ్మరంగా..

వరుసగా ఐదో రోజు శనివారం కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. జేసీబీలు, ఇతర భారీ యంత్రాలు, టెక్నాలజీ సాయంతో ఆర్మీ, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, వాలంటీర్ల బృందాలకు చెందిన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ముండకై, చూరల్ మల ప్రాంతాల్లోని అనేక చోట్ల భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల పెద్ద పెద్ద బండరాళ్లు, దుంగలు కొట్టుకువచ్చి పేరుకుపోయాయని, వాటికింద చిక్కుకున్న వారిని కాపాడటం, మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారుతోందని అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో బాధితులు ఎవరైనా ప్రాణాలతో బయటపడితే వెంటనే వైద్య సాయం అందించేందుకు డాక్టర్లు, ఇతర స్టాఫ్, అంబులెన్సులను సిద్ధంగా ఉంచామన్నారు. 

గోమాత రక్తం చిందినందుకే..: బీజేపీ నేత

వయనాడ్ విపత్తుకు గోవధనే కారణమని రాజస్థాన్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజా చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎక్కడైతే గోమాత రక్తం చింది నేలపై కారేలా చేస్తారో.. అక్కడ ఇలాంటి విపత్తులే వస్తాయి. గోవధ కొనసాగే చోట్ల భవిష్యత్తులోనూ ఇలాంటి విపత్తులే వస్తాయి. 2018 నుంచీ చూస్తే.. గోవధ జరిగిన ప్రాంతాల్లోనే ఇలాంటి విషాద ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కేరళలో గోవధను ఆపకపోతే ఇలాంటి విపత్తులు మరిన్ని సంభవిస్తాయి” అని అహూజా అన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా క్లౌడ్ బరస్ట్ లు, ల్యాండ్ స్లైడ్ ఘటనలు తరచుగా వస్తున్నా ఎక్కడా ఇంత తీవ్రస్థాయిలో విపత్తులు సంభవించలేదన్నారు. 

 మృతులకు బైడెన్ సంతాపం 

వయనాడ్​లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మృతిచెందిన ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ విచారం వ్యక్తం చేశారు. ‘‘ఈ విషాద సమయంలో బాధితుల కోసం మేం ప్రార్థిస్తున్నాం.ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఎంతో ధైర్య సాహసాలతో సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది అందరికీ అభినందనలు చెప్తున్నాం” అని బైడెన్ దంపతులు పేర్కొన్నట్టు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

రూ. 3 కోట్లు విరాళం ఇచ్చిన మోహన్ లాల్ 

కొండచరియలు విరిగి పడిన మెప్పాడి ప్రాంతాన్ని ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ శనివారం పరిశీలించారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ఆయన ఆర్మీ యూనిఫామ్ ధరించి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఆర్మీ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పునరావాస చర్యల కోసం రూ. 3 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అవసరమైతే తాను సభ్యుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్ నుంచి మరిన్ని ఫండ్స్ అందేలా చూస్తానన్నారు. మోహన్ లాల్ వెంట సినిమా డైరెక్టర్ మేజర్ రవి కూడా ఉన్నారు. కాగా, వయనాడ్ బాధితుల కోసం తమ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 ఇండ్లను నిర్మించి ఇస్తామని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.