పినరయి విజయన్ ఎన్డీఏలో చేరితే..కేరళకు మోదీ భారీ ప్యాకేజీ ఇస్తరు

పినరయి విజయన్ ఎన్డీఏలో చేరితే..కేరళకు మోదీ భారీ ప్యాకేజీ ఇస్తరు
  • కేంద్ర మంత్రి అథవాలే కామెంట్లు
  • ఖండించిన సీపీఎం నాయకులు 

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఎన్‌‌‌‌డీఏలో చేరితే రాష్ట్రానికి భారీగా నిధులు వస్తాయని కేంద్ర సామాజిక న్యాయ శాఖ రాష్ట్ర మంత్రి రామ్‌‌‌‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. బుధవారం కేరళలో పర్యటించిన ఆయన కన్నూర్​లో మీడియాతో మాట్లాడుతూ.. విజయన్ ఎన్‌‌‌‌డీఏలో చేరితే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మళ్లీ సీఎం అవుతారన్నారు. అలాగే సీపీఐ, సీపీఐ(ఎం) కూడా ఎన్‌‌‌‌డీఏలో చేరాలని సూచించారు. 

అదొక విప్లవాత్మక మార్పు అవుతుందని, నరేంద్ర మోదీ కేరళకు భారీ మొత్తంలో ప్యాకేజీ ఇస్తారని.. ఆ డబ్బుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చన్నారు. అథవాలే కామెంట్లపై సీపీఎం మండిపడింది. సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి  ఎం.వి.గోవిందన్ స్పందిస్తూ.. అథవాలే వ్యాఖ్యలు రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. 

గత ఐదేళ్లలో కేరళకు రూ.2 లక్షల కోట్ల నిధులు రావాల్సి ఉండగా కేంద్రం ఇవ్వలేదని ఆరోపించారు. ఇలాంటి మాటలు సమాఖ్య వ్యవస్థపై దాడి చేయడమేనని సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తాయన్నారు. అలాగే ఆయన కామెంట్లు ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌కు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించారు.