గవర్నర్​పై సుప్రీంలో కేరళ సర్కారు పిటిషన్​

గవర్నర్​పై సుప్రీంలో కేరళ సర్కారు పిటిషన్​
  • ఏండ్ల తరబడి బిల్లులు పెండింగ్​లో పెట్టారని ఆరోపణ

న్యూఢిల్లీ: కేరళ అసెంబ్లీ ఆమోదించిన 8 బిల్లులను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్​ పెండింగ్​లో పెట్టారని ఆ రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వాటిని వెంటనే ఆమోదించేలా ఆదేశాలివ్వాలని కోరింది. ఈ మేరకు సీఎం విజయన్ సర్కారు గురువారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. మొత్తం 8 బిల్లుల్లో 3 బిల్లులు రెండేండ్లుగా, మరో 3 బిల్లులు ఏడాదికిపైగా పెండింగ్​లో ఉన్నాయని పేర్కొంది. ప్రజావసరాలను ప్రభావితం చేసే సంక్షేమ చర్యలకు సంబంధించిన బిల్లులను గవర్నర్ సకాలంలో ఆమోదించలేదని పేర్కొంది. 

ఆ రకంగా గవర్నర్ ఆరిఫ్ రాజ్యాంగ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని కేరళ సర్కార్ ఆరోపించింది. అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల ఆమోదం పొందిన బిల్లులను అటు ఆమోదించకుండా, ఇటు తిరస్కరించకుండా ఉద్దేశపూర్వకంగా తన వద్దే ఉంచుకోవడం రాజ్యాంగ బాధ్యతల నుంచి తప్పుకున్నదానితో సమానమేనని వాదించింది. సీఎం విజయన్ సర్కారు, గవర్నర్ ఆరిఫ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య యూనివర్సిటీల చాన్స్​లర్ పదవి నుంచి గవర్నర్​ను తొలగించిన బిల్లుకూడా పెండింగ్​లోనే ఉంది.