
- కేరళ హైకోర్టు వ్యాఖ్యలు
కొచ్చి: పవర్ ఉన్నోళ్లకో న్యాయం.. సాధారణ ప్రజలకో న్యాయం ఉండదని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. అనుమతిలేకుండా రాష్ట్రంలో జెండా స్తంభాలు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని, పవర్ ఉన్నవ్యక్తులు లేదా పొలిటికల్ లీడర్లు చేసినంత మాత్రాన అది న్యాయం కాబోదని తెలిపింది. జెండా స్తంభాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఓ రాజకీయ పార్టీ తమ భూమిలో అక్రమంగా జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తోందంటూ ఓ కోఆపరేటివ్ సొసైటీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతోంది. రాష్ట్రంలో ఎటువంటి అక్రమ జెండా స్తంభాలు లేదా మాస్ట్‌లు పెట్టకూడదని ఆదేశిస్తూ నిరుడు నవంబర్1న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జెండా స్తంభాల ఏర్పాటును క్రమబద్ధీకరించే విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్రం ఇంతకుముందు మూడు నెలల టైమ్అడిగిందని, ఇప్పుడు దాన్ని మరింత పెంచమంటే ఎలా అని జస్టిస్ దేవన్ రామచంద్రన్ ప్రశ్నించారు. భవిష్యత్తులో అక్రమ జెండా స్తంభాలు ఏర్పాటు చేయనియబోమని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వకపోవడం ఆందోళనకరమన్నారు.