
ప్రపంచంలో ఉన్న వింతలన్నీ అమెజాన్ ఆన్‌లైన్ సేల్స్‌లోనే జరుగుతున్నాయి. ఆర్డర్ చేసింది ఒకటైతే... వచ్చేది మరొకటి అవుతుంది. ఒక్కొక్క సందర్భాల్లో ఆర్డర్ చేసిన వస్తువుతో పాటు.. ఆర్డర్ చేయని వస్తువులు కూడా వస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి అమెజాన్‌లో పర్సు ఆర్డర్ చేస్తే... అతనికి పర్సుతో పాటు... అందులో పాస్ పోర్టు కూడా వచ్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని వాయినాడ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వాయినాడ్ జిల్లా కణియంబెట్టా అనే గ్రామానికి చెందిన మిథున్ బాబు అనే వ్యక్తి అమెజాన్‌లో అక్టోబర్ 30వ తేదీన ఓ పర్సు ఆర్డర్ చేశాడు. అయితే ఆయనకు ఆర్డర్ చేసిన రెండు రోజుల తర్వాత పర్సు డెలివరీ అయ్యింది. అయితే నచ్చిన పర్సు వచ్చిందని ఆనందంగా తెరిచి చూసిన ఆయన అనుకోని షాక్ తగిలింది. పర్సులోపల ఓ పాస్ పోర్టు ఉండడం చూసి మిథున్ బాబు అవాక్కయ్యాడు. అయితే అతడు అది ఏదో డమ్మీ పాస్ పోర్టు అయి ఉంటుందని ముందుగా భావించాడు.
అయితే ఆ తర్వాత దానిపై ఉన్న వివారాలు చూసి ఆరా తీశాడు. దీంతో అది ఒరిజినల్ పాస్ పోర్టు అని తేలింది. త్రిసూర్ ప్రాంతానికి చెందిన పాస్ పోర్టుగా గుర్తించాడు. వెంటనే అతడు అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేశాడు. కానీ వారి నుంచి మిథున్‌కు సరైనా సమాధానం లభించలేదు. ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామంటూ చల్లగా చెబుతూ లైన్ కట్ చేశారు కస్టమర్ కేర్ ప్రతినిధులు. దీంతో మిథున్ ఇక చేసేది లేక... పాస్ పోర్టు ఓనర్ అయినా మొహమ్మద్ సాలిహ్‌ను కాంటాక్ట్ చేశాడు. ట్రావెల్ డాంక్యుమెంట్‌లో ఉన్న వివరాలు ఆధారంగా అతడి అడ్రస్ కనుక్కున్నాడు. దీంతో మిథున్ ఆర్డర్ చేసుకున్న పర్సులోకి సాలిహ్ పాస్ పోర్టు ఎలా వచ్చిందన్న మిస్టరీ వీడింది.
వాస్తవానికి అదే పర్సును మొహమ్మద్ సాలిహ్ కూడా అమెజాన్‌లో ఆర్డర్ చేశాడు. అయితే ఆ పర్సు తనకు నచ్చకపోవడంతో తిరిగి రిటర్స్ చేశాడు. అయితే రిటర్న్ చేసే సమయంలో అతడు తన పాస్ పోర్టు నుంచి అందులోని ఉంచిన విషయం మరిచిపోయాడు. పర్సును అలాగే రిటర్న్ చేశాడు. అయితే అలాంటి పర్సునే బుక్ చేసుకున్న మిథున్ బాబుకు అమెజాన్ అదే పర్సును డెలివరీ చేసిందన్న విషయం బయట పడింది. అయితే రిటర్న్ చేసిన వస్తువుల్ని ఏ మాత్రం చెక్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అమెజాన్ సంస్థ... తిరిగి కస్టమర్లకు డెలివరీ చేస్తుందన్న సంగతి ఈ విషయంతో బయటపడింది. అంతేకాకుండా ఇలాంటి సందర్భాల్లో కస్టమర్ కేర్ స్పందిస్తున్న వైఖరి కూడా వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమేజాన్ కస్టమర్ కేర్ కూడా ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని మిథున్ బాబు ఆరోపిస్తున్నారు. తనకు ఏం చేయాలన్నది కూడా కనీసం చెప్పలేదని ఆయన విమర్శిస్తున్నారు.
గత నెలలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఎర్నాకుళం జిల్లా అలువా ప్రాంతానికి చెందిన వ్యక్తి అమెజాన్‌లో ఐఫోన్‌లో ఆర్డర్ చేస్తే.. అతడికి ఐఫోన్‌కు బదులు సబ్బుతో పాటు.. ఐదు రూపాయల కాయిన్ వచ్చింది. దీంతో బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల విచారణలో ఆ ఐఫోన్ అప్పటికే.. జార్ఖాండ్‌లో ఓ వ్యక్తి సెప్టెంబర్ 25 నుంచి వాడుతున్నట్లు తెలిసింది. అయితే ఆ తర్వాత సంస్థ తనకు రావాల్సిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు బాధితుడు నూరుల్ అమీన్ మీడియాకు తెలిపారు.