కేరళ యువకుడికి బ్రిటన్ విశిష్ట పురస్కారం

కేరళ యువకుడికి బ్రిటన్ విశిష్ట పురస్కారం

లండన్: కరోనా కష్టాల కాలంలో విశిష్ట సేవలు అందించిన కేరళ యువకుడు ప్రభు నటరాజన్ (34) కు బ్రిటన్ లో సముచితమైన గౌరవం లభించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం యూకే పాయింట్స్ ఆఫ్ లైట్ పురస్కారంతో నటరాజన్ ను సత్కరించింది. గత ఏడాది కరోనా వ్యాప్తి మొదలైన సమయంలోనే నటరాజన్ తన కుటుంబంతో కలసి బ్రిటన్ వెళ్లాడు. యూకేలో అడుగుపెట్టిన కొన్ని రోజులకే ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైంది. ఉద్యోగం కోసం బ్రిటన్ వెళ్లిన ప్రభు నటరాజన్ కు లాక్ డౌన్ పరిణామాలు తీరని కష్టాలు తెచ్చిపెట్టాయి. 
ఆది నుంచి సేవా మార్గంలో వెళ్తున్న ప్రభు నటరాజన్ తన భార్య, కుమారుడితో కలసి లాక్ డౌన్ వేళ వందల మంది నిర్భాగ్యులకు ఆహారం అందించాడు. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కార్యాలయం వారి వివరాల ప్రకారం నటరాజన్ 11 వేలకు పైగా చాక్లెట్లు ఇతర ఆహార పదార్థాలను పంచి పెట్టడం ద్వారా తాను నివసిస్తున్న ప్రాంతంలోని వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేశాడు. అంతే కాదు తాను ఉంటున్న ప్రాంతంలోనే ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇతర దాతలను కలుపుకుని వారు ఇచ్చిన ఆహారం తీసుకుని ఆకలి కష్టాల్లో ఉన్న వారి కడుపు నింపాడు. 
నటరాజన్ సేవలను గుర్తించిన ప్రభుత్వం విశిష్ట పురస్కారంతో గౌరవించింది. గత నెలలో భారత్ లో ఉన్న తన తండ్రితోపాటు మరో 11 మంది బంధువులు, 9 మంది స్నేహితులు కరోనాతో చనిపోయిన బాధలో ఉన్న తనకు ఈ పురస్కారం కొండంత ఊరట కలిగించిందని నటరాజన్ పేర్కొన్నాడు. తనకు దక్కిన పురస్కారం అంతా తన కుటుంబంలో, బంధు మిత్రుల్లో కరోనాతో మృతి చెందిన వారికే అంకితమని నటరాజన్, దేవుడు అవకాశం ఇచ్చినన్ని రోజులు సేవను కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.