Ranji Trophy 2025-26: ఫుట్ బాల్ కాదు ఇది క్రికెటే: మహారాష్ట్రకు ఘోరమైన ఆరంభం.. నలుగురు డకౌట్

Ranji Trophy 2025-26: ఫుట్ బాల్ కాదు ఇది క్రికెటే: మహారాష్ట్రకు ఘోరమైన ఆరంభం.. నలుగురు డకౌట్

రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు ఘోరమైన ఆరంభం లభించింది. ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే గత సీజన్ రన్నరప్ కేరళపై ఊహించని విధంగా కుప్పకూలింది. 5 తొలి గంట ఆటలో భాగంగా 5 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. బుధవారం (అక్టోబర్ 15) తొలి రోజు ఆటలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఐదు పరుగులు కూడా ఎక్స్ ట్రాల రూపంలో రావడం గమనార్హం. తొలి 6 ఓవర్లలో ఆ జట్టు బ్యాటర్లు ఒక్క పరుగు చేయకపోవడం ఆశ్చర్యానికి గురు చేసింది. స్కోర్ బోర్డు మీద 5 పరుగులు ఉన్నప్పటికీ అవి వైడ్ ల రూపంలో రావడం విశేషం.

ఎం.డి. నిధీష్, నెడుమంకుజి బాసిల్ బౌలింగ్ ధాటికి మహారాష్ట్ర వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన పృథ్వీ షా నాలుగు బంతులాడి ఎల్బీడబ్ల్యూ రూపంలో డకౌటయ్యాడు. ఆ తర్వాత అర్షిన్ కులకర్ణి, సిద్ధేష్ వీర్ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగారు. అంకిత్ బావ్నేను ఒక అదిరిపోయే డెలివరీతో బాసిల్ డకౌట్ గా పెవిలియన్ కు పంపడంతో 5 పరుగులకే మహారాష్ట్ర నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ నలుగురు కూడా డకౌట్ కావడం షాక్ కు గురి చేస్తోంది. రంజీల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీంగా చెప్పుకునే మహారాష్ట్రకు ఇంత ఘోరమైన ఆరంభం లభించడం ఊహించనిది. 

కాసేపటికే వికెట్ కీపర్ సౌరభ్ నవాలే కూడా ఔట్ కావడంతో 18 పరుగులకే మహారాష్ట్ర సగం జట్టును కోల్పోయింది. మహారాష్ట్ర బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టడంతో నెటిజన్స్ వీరిపై ట్రోలింగ్ చేస్తున్నారు. మీరు క్రికెట్ స్కోర్ కార్డుల కాదు ఫుట్ బాల్ స్కోర్ కార్డులా ఉందంటూ సెటైర్ వేస్తున్నారు. 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన గైక్వాడ్, సక్సేనా మహారాష్ట్ర ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర 53 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. క్రీజ్ లో గైక్వాడ్ (15), సక్సేనా (21) ఉన్నారు. కేరళ బౌలర్లలో ఎం.డి. నిధీష్ మూడు వికెట్లు పడగొట్టాడు. నెడుమంకుజి బాసిల్ ఒక వికెట్ తీసుకున్నాడు.