తిరువనంతపురం: వీడీ సతీశన్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం కొత్తగా ఎన్నికైన మంత్రులకు శాఖలు కేటాయించింది. ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన, ఓడరేవుల వంటి ప్రధాన శాఖలను సీఎం వీడి సతీశన్ తన దగ్గరే ఉంచుకున్నారు. ఇక, కీలకమైన హోంశాఖను కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితాలకు అప్పగించారు. హోంతో పాటు విజిలెన్స్ మరో మూడు శాఖలను ఆయనకు కేటాయించారు.
యూడీఎఫ్ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) నాయకుడు పీకే కున్హాలికుట్టి పరిశ్రమలు, సమాచార సాంకేతికత, వస్త్ర పరిశ్రమలతో సహా ఏడు విభాగాలను పర్యవేక్షించనున్నారు. కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌కు విద్యుత్, పర్యావరణ శాఖను కేటాయించగా.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె. మురళీధరన్‌ను ఆరోగ్య, దేవస్వం శాఖల మంత్రిగా నియమించారు. రోజి ఎం జాన్‌కు ఉన్నత విద్యా శాఖ అప్పగించగా.. ఏపీ అనిల్ కుమార్‌కు ల్యాండ్, రెవెన్యూ పోర్ట్‌ఫోలియోను కేటాయించారు.
►ALSO READ | బొద్దింక జనతా పార్టీ వెనకున్న ఈ అభిజీత్ దీప్కే ఎవరు..? టార్గెట్ ఏంటి..?
ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ ఏకంగా 102 సీట్లు గెలుచుకొని రికార్డు సృష్టించింది. కాంగ్రెస్ హైకమాండ్ వివిధ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని సీనియర్ లీడర్ వీడీ సతీశన్‌ను సీఎంగా ఎంపిక చేసింది. 2026, మే 18న కేరళ13వ ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతోపాటు 20 మంది సభ్యులు ప్రమాణం చేయగా.. కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఈ క్రమంలోనే కొత్తగా ఎన్నికైన తన కేబినెట్లోని సహచర మంత్రులకు వీడీ సతీశన్ బుధవారం (మే 20) శాఖలు కేటాయించారు.
