కేరళ స్టోరీతో టెర్రరిస్ట్ కుట్రలు బయటపడ్డయ్ : మోడీ

కేరళ స్టోరీతో టెర్రరిస్ట్ కుట్రలు బయటపడ్డయ్ : మోడీ
  • ఆ సినిమాను బ్యాన్ చేయాలనడం టెర్రరిస్ట్ శక్తులకు మద్దతివ్వడమే
  • కాంగ్రెస్ పార్టీ టెర్రరిజం ముందు మోకరిల్లింది
  • కాంగ్రెస్ ‘85% కమీషన్’ పార్టీ అని రాజీవ్ గాంధే చెప్పారు 
  • రాష్ట్రంలో మళ్లీ డబుల్ ఇంజన్ సర్కారే 
  • అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని 

బళ్లారి (కర్నాటక)/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును కాపాడుకోవటం కోసం టెర్రరిజం ముందు మోకరిల్లుతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అయ్యారు. ఒక రాష్ట్రంలో జరిగిన టెర్రరిస్ట్ కుట్రల ఆధారంగా తీసిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్ చేయాలంటున్న కాంగ్రెస్.. టెర్రరిజానికి ఊతం అందిస్తున్న శక్తులకు మద్దతుగా నిలుస్తోందన్నారు. శుక్రవారం కర్నాటకలోని బళ్లారి, తుమకూరులో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో మోడీ మాట్లాడారు. ‘‘బాంబులు, పిస్టల్స్, గన్స్ చాలా పెద్ద శబ్దం చేస్తాయి. కానీ టెర్రరిస్ట్ కుట్రకు ఎలాంటి శబ్దం ఉండదు. అది సమాజాన్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తుంది. ఈ కొత్త రకమైన టెర్రరిజంపై కోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి టెర్రరిస్ట్ కుట్రల కథతో రూపొందించిన ది కేరళ స్టోరీ సినిమా గురించి నేడు విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి” అని ప్రధాని అన్నారు. కేరళ వంటి అందమైన, ఎంతో కష్టపడి పని చేసే, ప్రతిభ కలిగిన ప్రజలు ఉన్న రాష్ట్రంలో జరిగిన టెర్రరిస్ట్ కుట్రను ఈ సినిమా బయటపెట్టిందని చెప్పారు.

 టెర్రరిజాన్ని అణచేస్తే కాంగ్రెస్ కు కడుపునొప్పి 

టెర్రరిజంపై బీజేపీ ఎల్లప్పుడూ కఠినంగా ఉంటుందని మోడీ స్పష్టం చేశారు. కానీ టెర్రరిజంపై ఎప్పుడు చర్యలు తీసుకున్నా, కాంగ్రెస్ కు కడుపునొప్పి వస్తుందన్నారు. ‘‘ఇయ్యాల ప్రపంచమంతా టెర్రరిజం గురించి ఆందోళన చెందుతోంది. మనం కూడా ఎన్నో ఏండ్లుగా బాధపడుతున్నాం. టెర్రరిజం మానవత్వం, విలువలు, అభివృద్ధికి వ్యతిరేకం. కానీ కేవలం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ టెర్రరిజం ముందు సరెండర్ కావడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాంటి పార్టీ కర్నాటకను, ప్రజలను రక్షించగలదా? టెర్రరిజం పెరిగితే ఇండస్ట్రీలు, ఐటీ, వ్యవసాయం, రాష్ట్ర కల్చర్, హెరిటేజ్ వంటివన్నీ నాశనం అవుతాయి” అని ఆయన హెచ్చరించారు. టెర్రరిజానికి కాంగ్రెస్ పార్టీ షెల్టర్ ఇచ్చి, పెంచి పోషించిందని ఆరోపించారు.   

కాంగ్రెస్ ‘85% కమీషన్’ పార్టీ 

కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘40% కమీషన్’ సర్కార్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను మోడీ తిప్పికొట్టారు. కాంగ్రెస్ 85% కమీషన్ పార్టీ అని స్వయంగా ఆ పార్టీ గతంలోనే ఒప్పుకుందన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయిని పంపితే.. అందులో కేవలం 15 పైసలే ప్రజలకు చేరుతున్నాయని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ 85% కమీషన్ పార్టీ అన్నది ఆయన మాటలను బట్టే తేలిపోయింది” అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్నీ తప్పుడు వాగ్దానాలే ఉన్నాయన్నారు. కర్నాటకను నెంబర్ వన్​ రాష్ట్రంగా మార్చేందుకు బీజేపీ ఒక రోడ్ మ్యాప్​తో కూడిన తీర్మాన లేఖను విడుదల చేసిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలన్నీ బుజ్జగింపు రాజకీయాలతోనే నిండాయన్నారు. 

జేడీఎస్​కు ఓటేస్తే బలహీన సర్కార్ 

‘‘కర్నాటక బాగు కోసం కాంగ్రెస్ ఎన్నడూ పని చేయదు. ఆ పార్టీ ఎన్నటికీ అభివృద్ధి చేయదు’’ అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో గత తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో పేదలు, రైతులు, యువత కోసం ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ‘‘కాంగ్రెస్, జేడీఎస్ పాలనలో భారీగా దోపిడీ జరిగింది. వారి ఆటను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. జేడీఎస్​కు ఓటు వేస్తే కర్నాటకకు బలహీనమైన, అస్థిరమైన ప్రభుత్వం వస్తుందని, బలహీన ప్రభుత్వంతో బలమైన కర్నాటకను నిర్మించలేమని తెలుసుకున్నారు” అని మోడీ చెప్పారు.

భారీ మెజార్టీతో గెలుస్తాం 

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కే అనుకూలంగా వస్తాయంటూ విడుదలైన ప్రీపోల్ సర్వేలను మోడీ ఖండించారు. ప్రీపోల్ సర్వేల అంచనాలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు. కర్నాటక ప్రజల మద్దతుతో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అవినీతికి పాల్పడుతూ ప్రజలను కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు. ఇప్పుడు తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలవాలన్న మరో ఎత్తుగడను వేస్తోందన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుందన్నారు. ‘‘బీజేపీకి వస్తున్న మద్దతు చూసి కాంగ్రెస్ వణికిపోతోంది. చివరకు నేను ‘జై బజరంగ్ బలి’ అన్నా కూడా భయపడుతోంది” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీపై ఈ మేరకు మోడీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తన ప్రసంగంలో అనేక సార్లు జై బజరంగ్ బలి అంటూ నినాదాలు చేస్తూ.. ర్యాలీలకు వచ్చిన ప్రజలతో కూడా నినాదాలు చేయించారు.

లక్ష్మణ్​తో మోడీ ముచ్చట

హైదరాబాద్, వెలుగు: ఎంపీ కె.లక్ష్మణ్​తో ప్రధాని మోడీ కాసేపు ముచ్చటించారు. శుక్రవారం బళ్లారిలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ప్రధాని మోడీ.. అక్కడే ప్రచారం నిర్వహిస్తున్న లక్ష్మణ్​తో మాట కలిపారు. ఎన్నికల ప్రచార సరళి గురించి అడిగి తెలుసుకున్నారు. బళ్లారి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ట్రెండ్​ గురించి మోడీ ఆరా తీశారు.

మణిపూర్​పై దృష్టిపెట్టండి.. మోడీకి కాంగ్రెస్  సూచన

ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కర్నాటక ఎన్నికల ప్రచారంపై కాకుండా హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ పై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. ‘‘మణిపూర్ లో శాంతిని కాపాడటంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. మణిపూర్​లో రాష్ట్రపతి పాలన విధించాలి” అని ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ డిమాండ్ చేశారు. ‘‘మోడీజీ.. మీరు ఈ దేశానికి ప్రధాని. మణిపూర్​లో జరుగుతున్న హింసను కర్నాటక ప్రజలు కూడా చూస్తున్నారు. ముందుగా మీరు మణిపూర్​ను కాపాడాలని వారు కోరుకుంటున్నారు. మణిపూర్​ను కాపాడటమే ప్రస్తుతం మీ తక్షణ బాధ్యత అని గుర్తుచేస్తున్నాం” అని ఆమె పేర్కొన్నారు. ‘‘మంటల్లో తగలబడుతున్న మణిపూర్ ను రక్షించాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వేడుకుంటున్నారు. కానీ ప్రధాని, హోం మంత్రి మాత్రం కర్నాటక ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. మణిపూర్ బూడిదైనా సరే.. తమకు ఓట్లే ముఖ్యమని భావిస్తున్నారు” అని ఆమె విమర్శించారు.