45 రోజులు హాస్పిటల్‌లో 19 సార్లు కరోనా పాజిటివ్‌

45 రోజులు హాస్పిటల్‌లో 19 సార్లు కరోనా పాజిటివ్‌
  • 20వ సారి నెగటివ్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్న డాక్టర్లు

పథణంతిట్ట: కేరళలోని 62 ఏళ్ల బామ్మ 45 రోజుల పాటు కరోనాతో పోరాడి బయటపడింది. వైరస్‌ సోకి ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన అధికారులు 19 సార్లు కరోనా టెస్ట్‌ చేయగా పాజిటివ్‌ వచ్చింది. ఎట్టకేలకు 20వసారి నెగటివ్‌ రావడంతో డాక్టర్లు ఊపిరిపీల్చుకున్నారు. కేరళ పథనంతిట్ట జిల్లా వదాసెరిక్కరకకు చెందిన 62 ఏళ్ల మహిళకు ఇటలీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా కరోనా సోకింది. దీంతో హాస్పిటల్‌లో చేరిన ఆమెకు 45 రోజుల పాటు ట్రీట్‌మెంట్‌ అందించారు. ఈ నేపథ్యంలో మధ్యలో కరోనా టెస్ట్‌ చేయగా.. 19 సార్లు పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెకు ట్రీట్‌మెంట్‌ ఇచ్చిన డాక్టర్లు ‘ఇవర్‌‌మెక్టిన్‌’ అనే మందును వాడారు. ఆ తర్వాత 20వసారి టెస్ట్ చేయడంతో నెగటివ్‌ వచ్చిందని అన్నారు. వరుసగా 21వ సారి చేసి టెస్ట్‌లో కూడా నెగటివ్‌ రావడంతో ఆమెను డిశ్చార్జ్‌ చేయాలనుకుంటున్నామని అన్నారు. మెడికల్‌ బోర్డు పర్మిషన్‌ వచ్చిన వెంటనే హాస్పిటల్‌ నుంచి పంపుతామని డాక్టర్లు చెప్పారు. ఆమెతో పాటు మరో ఎనిమిది మంది హాస్పిటల్‌లో చేరగా వాళ్లంతా డిశ్చార్జ్‌ అయ్యారు. వారిలో 92 ఏళ్ల ముసలాయన కూడా ఉన్నాడు.