ఎంపీలకు మళ్లీ నిధులు

ఎంపీలకు మళ్లీ నిధులు
  • ఎంపీల్యాడ్స్ స్కీమ్​ కొనసాగింపునకు కేబినెట్ కమిటీ ఆమోదం
  • ఈ ఏడాది ఒక్కో ఎంపీకి రూ. 2 కోట్లు
  • ఆ తర్వాత ఏటా రెండు విడతల్లో రూ. 5  కోట్లకు ఆమోదం
  • ఎంఎస్పీ నష్టాలను పూడ్చుకునేందుకు సీసీఐకి రూ. 17 వేల కోట్లు 

న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాల్లో వివిధ పనుల కోసం ఖర్చుచేసే ఎంపీల్యాడ్స్ నిధులను కేంద్రం పునరుద్ధరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి స్కీంను అనుమతించడంతోపాటు ఆ తర్వాత 2025–26 వరకూ ఎంపీల్యాడ్స్​ను కొనసాగించేందుకు బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఈఏ)’ ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద మొత్తం రూ.17,417 కోట్లను కేంద్రం కేటాయించనుంది. కరోనా విపత్తు కారణంగా ఫైనాన్స్ మినిస్ట్రీ వద్ద నిధులను అందుబాటులో ఉంచేందుకు గాను కేంద్రం నిరుడు ఏప్రిల్​లో ఎంపీల్యాడ్స్ ను 2022 దాకా రద్దు చేసింది. వీటికింద మిగిలే నిధులను హెల్త్ కేర్ సౌలతులు మెరుగుపర్చేందుకు, పీఎం గరీబ్ కల్యాణ్​యోజన కింద ఫ్రీ రేషన్, ఉచితంగా టీకాలు ఇచ్చేందుకు ఉపయోగించింది. ఎంపీల్యాడ్స్​ను పునరుద్ధరించడంతో ఎప్పట్లాగే ఎంపీలకు 2021–22లో మిగిలిన కాలానికి రూ. 2 కోట్లను, ఆ తర్వాత ఏటా రెండు విడతల్లో రూ. 5  కోట్లను కేంద్రం కేటాయించనుంది. మెంబర్ ఆఫ్​పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్ మెంట్ స్కీం (ఎంపీల్యాడ్స్)  నిధులను తిరిగి ప్రారంభించడంతో పాటు కమిటీ ఇతర పలు కీలక నిర్ణయాలకు కూడా సీసీఈఏ ఓకే చెప్పింది.

 సీసీఐకి రూ.17 వేల కోట్లు 

కాటన్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్ల కోసం సీసీఈఏ రూ.17,408.85 కోట్లకు ఆమోదం తెలిపింది. 2014–15 నుంచి 2020–21 దాకా ఏడు సీజన్లకు సంబంధించి కనీస మద్దతు ధరను అందించడం వల్ల సీసీఐకి వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు గాను ఈ నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది.

నవంబర్ 15.. జన్‌‌జాతీయ గౌరవ్ దివస్

జార్ఖండ్​కు చెందిన ప్రముఖ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్, సోషల్ రిఫార్మర్ భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఏటా నవంబర్ 15వ తేదీని ‘జన్‌‌జాతీయ గౌరవ్ దివస్’గా పాటించాలని సీసీఈఏ ప్రకటించింది. దేశ చరిత్ర, కల్చర్​కు ఎనలేని సేవలు చేసిన ఎస్టీల గౌరవార్థం ఈ రోజున వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించింది. ఏటా నవంబర్ 15 నుంచి 22 మధ్య వారం రోజుల పాటు బిర్సా ముండా స్మారక కార్యక్రమాలను కేంద్రం నిర్వహించనున్నట్లు కమిటీ వెల్లడించింది.

ఇథనాల్ రేటు రూ. 1.47 పెంపు 

పెట్రోల్​లో కలిపేందుకు చెరకు రైతులు, మిల్లుల నుంచి ఆయిల్ కంపెనీలు కొనే ఇథనాల్ రేటును పెంచాలని సీసీఈఏ నిర్ణయించింది. డిసెంబర్ నుంచి లీటరు ఇథనాల్​పై రూ.1.47 మేరకు పెంపుదల వర్తిస్తుందని తెలిపింది. పెట్రోల్​లో ఇథనాల్​ను ఎక్కువగా వాడటం వల్ల ఆయిల్ ఇంపోర్టులు తగ్గేందుకు, చెరుకు రైతులు, మిల్లులు లాభపడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే 2025 నాటికి 20శాతం ఇథనాల్​ను కలిపిన పెట్రోల్ వాడేలా చూడాలని కేంద్రం టార్గెట్​గా పెట్టుకుంది. ప్రస్తుతం లీటరు ఇథనాల్ ధర రూ.62.65 కాగా, డిసెంబర్ నుంచి ధర రూ.63.45కు పెరగనుంది.