
Market Next Week: ఆపరేషన్ సిందూర్ తర్వాత గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల ఫలితాలతో పాటు యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మెగా ర్యాలీకి ఆజ్యం పోశాయి. దీంతో మార్కెట్లో పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.26 లక్షల కోట్ల మేర పెరుగుదలను నమోదు చేసింది.
అయితే ఇప్పుడు ఇన్వెస్టర్ల చూపు కొత్తవారం మార్కెట్లు ఎలా ఉండనున్నాయనే అంశంపైనే కొనసాగుతోంది. ప్రస్తుతం ట్రంప్ సర్కార్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలతో కుదుర్చుకుంటున్న ట్రేడ్ డీల్స్, ఇతర దేశాలపై దాని ప్రభావం గురించి అందరూ నిశితంగా పరిశీలిస్తున్నారు. గతవారం మార్కెట్లు బలమైన లాభాల ట్రెండ్ తో ముగియటంతో నిఫ్టీ, సెన్సెక్స్, స్మాల్ అండ్ లార్జ్ క్యాప్స్ పెరుగుదలను చూశాయి. బెంచ్ మార్క్ సూచీలు ఈ క్రమంలో 4 శాతం వరకు పెరుగుదలను నమోదు చేశాయి.
ఇక కొత్త వారంలో అందరూ దృష్టిపెడుతోంది పెద్ద కంపెనీలు విడుదల చేయనున్న తమ నాల్గవ త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలపైనే. దీనికి తోడు రానున్న వారంలో కొత్తగా 5 ఐపీవోలు తమ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు వస్తున్నాయి. ఇదే క్రమంలో 3 కంపెనీలు తమ ఐపీవోలు లిస్టింగ్ కోసం రానున్నాయి. ఇదే క్రమంలో ఇరాన్ యూఎస్ ట్రేడ్ డీల్ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు సైతం పెరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక ప్రధానంగా ఉన్న మరో విషయం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల మూడ్ గురించే. వాస్తవానికి ప్రస్తుతం కొనుగోలుదారులుగా ఉన్న ఎఫ్ఐఐలు ఏకంగా భారత మార్కెట్లోకి రూ.23వేల 778 కోట్లు కుమ్మరించారు. ఇదే క్రమంలో ప్రపంచ అగ్ర ఆర్థిక వ్యవస్థల కంటే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధి రేటును సాధించగలదనే అంచనాలు మార్కెట్లలో సానుకూల దృక్పదాన్ని కలిగిస్తున్నాయి. అలగే రిజర్వు బ్యాంక్ సైతం ద్రవ్యోల్బణం డేటా ఆధారంగా త్వరలోనే ఒక రేట్ కట్ ప్రతిపాదించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.