‘మిషన్ 100 డేస్’ ఎజెండాతో ముందుకెళ్తం : కిషన్ రెడ్డి

‘మిషన్ 100 డేస్’ ఎజెండాతో ముందుకెళ్తం : కిషన్ రెడ్డి
  •     దేశాభివృద్ధిలో బొగ్గు, గనులది కీలకపాత్ర: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు : తనకు కేటాయించిన బొగ్గు, గనుల శాఖలపై ఒకట్రెండు రోజుల్లో అధికారులతో చర్చించి ‘మిషన్ 100 డేస్ ఎజెండా’తో ముందుకెళ్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిల్లో బొగ్గు, గనులది కీలక పాత్ర అని చెప్పారు. ఆయా రంగాల్లో మరింత సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తామన్నారు. సోమవారం శాఖల కేటాయింపు తర్వాత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘‘దేశంలో బొగ్గు పాత్ర ఎంతో కీలకం. బొగ్గు వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై పనిచేయాల్సి ఉంటుంది. నాపై మోదీ ఉంచిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాననే విశ్వాసం ఉన్నది. ప్రైవేటు రంగంలో చాలా సంస్థలు బొగ్గు గనుల వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నాయి. వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. విద్యుత్ ఉత్పత్తి, స్టీల్ కంపెనీలకు బొగ్గు అవసరం ఉంటుంది’’అని అన్నారు.

ఎన్డీఏ హయాంలో విద్యుత్ కోతల్లేవు

2014కు ముందు దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలుండేవని, మోదీ వచ్చాక బొగ్గు ఉత్పత్తి పెంచడం ద్వారా నిరంతరం కరెంట్ సప్లై చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశమంతా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నదని తెలిపారు. ‘‘వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగ రంగాల్లో డిమాండ్ పెరుగుతున్నది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బొగ్గు కొరత లేకుండా చూస్తాం. విద్యుత్ ఉత్పత్తి పెంచడంపై ఫోకస్ చేస్తాం’’అని తెలిపారు.

బొగ్గు, గనుల శాఖలు దేశానికి రెవెన్యూ తీసుకొచ్చే కీలకమైన మంత్రిత్వ శాఖలన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయం పెంచే విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పారు. అయితే, గనులు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంటాయని వివరించారు.

వరంగల్ విమానాశ్రయానికి కృషి చేస్త

రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కడం సంతోషంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ లో ఎయిర్​పోర్టు కోసం రామోహ్మన్​తో కలిసి తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.

త్వరలో పార్టీలో మార్పులుంటయ్

త్వరలో తెలంగాణ బీజేపీలో సంస్థాగత మార్పులుంటాయని కిషన్ రెడ్డి తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్టేట్ చీఫ్ పదవిని అప్పగించినట్లు చెప్పారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో.. తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష మార్పులు ఉంటాయన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి మార్పు కూడా ఉంటుందని చెప్పారు.