
న్యూఢిల్లీ: ఒకప్పుడు మహత్మా గాంధీ ఖాదీ వాడకాన్ని ఎంతగానో ప్రమోట్ చేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఖాదీని ప్రమోట్ చేస్తూ.. ఈ ఇండస్ట్రీ పుంజుకోవడానికి సాయపడుతున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఖాదీ ఇండస్ట్రీ పుంజుకుంటోంది. 2019–20 ఆర్దిక సంవత్సరంలో ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీ (కేవీఐసీ) రూ. 90 వేల కోట్ల టర్నోవర్ ను ప్రకటించడమే దీనికి రుజువు. ఇది దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ. హిందుస్తాన్ యూనీలివర్ టర్నోవర్ (రూ.38,785 కోట్లు ) కంటే సుమారు ముడింతలు ఎక్కువ కావడం విశేషం. కేవీఐసీ టర్నోవర్ వచ్చే నాలుగేళల్లో రూ.5 లక్షల కోట్లకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెంబర్లు నమ్మశక్యంగా లేకపోవచ్చు. కానీ మనం కొంటున్న పెద్ద పెద్ద ఫ్యాషన్ స్టోర్లకు ఖాదీని ఈ కేవీఐసీనే సప్లయ్ చేస్తోందనే విషయం మరిచిపోకూడదు. తమ సంస్థలో తయారైన ఖాదీని రేమాండ్స్, అరవింద్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ వంటి కంపెనీలకు సప్లయ్ చేస్తున్నామని కేవీఐసీ చైర్మన్ వీకే సక్సేనా అన్నారు. రెండుమూడు ఇంటర్నేషనల్ కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు.
.కరోనా పరిస్థితులు.. ఆత్మ నిర్బర భారత్
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేవీఐసీ లక్షల కొద్దీ మాస్కులను తయారు చేసిందని, అంతే మొత్తంలో ఫ్రీగా పంచిందని సక్సేనా అన్నారు. ‘కరోనా కేసులు పెరుగుతుండడంతో కాటన్, సిల్క్ మాస్కులను తయారు చేయాలని మా ఖాదీ సంస్థలకు సూచనలిచ్చాం.. ఇప్పటి వరకు ఎనిమిది లక్షలకు పైగా మాస్కులను అమ్మాం… తొమ్మిది లక్షలకు పైగా మాస్కులను జిల్లా కలెక్టర్లకు అందించాం’ అని సక్సేనా పేర్కొన్నారు. ఖాదీ మార్కెట్ ను మరింతగా విస్తరిస్తున్నామని సక్సేనా అన్నారు. ఇప్పటికే వివిధ బ్రాండ్లకు ఖాదీ మార్క్ ను కేవీఐసీ ఇచ్చిందని చెప్పారు. కాగా గతంలో మిల్స్ లో తయారైన ఖాదీ ప్రాడక్ట్ లనుకూడా ‘చేతితో నేసిన’ ప్రొడక్ట్ లుగా అమ్ముతుండడంతో యూపీఏ ప్రభుత్వం ఖాదీ మార్క్ ను ఇచ్చిన ప్రొడక్ట్ లనే అమ్మాలని రూల్స్ పెట్టింది. ఖాదీ బ్రాండ్ ను కాపాడడానికి కేవలం ట్రేడ్ మార్క్ ఇవ్వడమే కాకుండా ఇతర చర్యలను కూడా కేవీఐసీ తీసుకుంటోంది. ఇండియాలో సులభంగా దొరికే ప్రొడక్ట్ లను దిగుమతి చేసుకోవద్దనే క్యాంపెయిన్ కూడా కేవీఐసీ నడుపుతోంది. వీటితోపాటు సిల్క్, చెక్క , బొమ్మలను దిగుమతి చేసుకోవడాన్ని కూడా బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. కేవలం ఇండియాలో తయారైన వస్తువులనే సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీసు ఫోర్స్ క్యాంటీన్లకు సరఫరా చేయాలని తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఆత్మ నిర్బర్’ లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ క్యాంటీన్లకు అధిక మొత్తంలో పొడక్ట్ లను సరఫరా చేయడానికి కేవీఐసీ కి వీలు కలుగుతోంది. కొత్తగా 30–40 లక్షల మంది కన్జూమర్లు యాడ్ అవుతారని సక్సేనా పేర్కొన్నారు.
మోడీనే బ్రాండ్ అంబాసిడర్..
దేశంలో ఖాదీ వాడకాన్ని ప్రధాని మోడీనే ముందుండి ప్రమోట్ చేస్తున్నారు. ఖాదీ బ్రాండ్ గత కొన్నేళ్లుగా ఫేమస్ అవుతోంది. 2015–16 నుంచి చూస్తే ఖాదీ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ ఏడాదికి సగటున 19.45 శాతం వృద్ధి చెందుతోంది. ఇది 2004–15 టైమ్ లో ఏడాదికి సగటున 6.25 శాతంగానే ఉండేది. ఖాదీ సేల్స్ గ్రోత్ కూడా 2004-–15 టైమ్ లో ఏడాదికి 6.65 శాతంగా ఉంటే ప్రస్తుతం 27.6 శాతానికి పెరిగింది. 1956 లో కేవీఐసీ స్టార్ట్ చేసినప్పుడు 0.42 మిలియన్ చదరపు అడుగుల ఖాదీని మాత్రమే తయారు చేసేవారు. ఇది 2013–-14 నాటికి 103.22 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఈ ప్రొడక్షన్ 2014–-15 నుంచి ఏడాదికి 15.8 మిలియన్ చదరపు అడుగులు చొప్పున పెరుగుతూ, 2019-–20 నాటికి 198.29 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది.
ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన ‘ఆత్మ నిర్బర్’ ప్యాకేజీ దేశంలో ఖాదీ ఇండస్ర్టీకి వరంలా మారనుంది. కొత్తగా ఈ ఇండస్ర్టీ కి కస్టమర్లు పెరుగుతున్నారు. కరోనా పరిస్థితులతో పాటు, ‘ఆత్మ నిర్బర్ ’ పిలుపుతో మార్కెట్లో అవకాశాలు పెరిగాయని కేవీఐసీ చైర్మన్ సక్సేనా చెప్పారు. వీటిని అందిపుచ్చుకునే సామర్థ్యం తమకుందని అన్నారు.
భారీ సంఖ్యలో ఉద్యోగాలు
కేవీఐసీ పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. దేశంలోని కేవీఐసీ కింద ఏర్పాటైన 2,25,886 యూనిట్లు ప్రత్యక్షంగా 5,26,070 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. దీనికి తోడు ప్రధానమంత్రి ఎంప్లాయి మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా సంస్థలకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందించి అదనంగా ఉద్యోగాలను కూడా కల్పిస్తోంది. గత ఐదేళల్లో గ్రామాల్లో రెండు లక్షల యూనిట్లు ఏర్పాటు కావడంలో కేవీఐసీ సాయపడింది. ఈ యూనిట్లు ఫుడ్ , అగ్రికల్చర్ ప్రొడక్ట్ లు, చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ను తయారు చేస్తున్నాయి.