ట్రంప్ టారిఫ్‎లతో ఇండియాపై ఎఫెక్ట్ ఎంత..? రంగాల వారీగా ప్రభావం ఇలా

ట్రంప్ టారిఫ్‎లతో ఇండియాపై ఎఫెక్ట్ ఎంత..? రంగాల వారీగా ప్రభావం ఇలా

న్యూఢిల్లీ: ఇండియన్ వస్తువులపై అదనపు 25% టారిఫ్​లు బుధవారం తెల్లవారుజామున 12 గంటల నుంచి (అమెరికా టైం ప్రకారం) అమలులోకి వస్తాయని అమెరికా ప్రకటించింది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సంస్థ ఈ మేరకు మంగళవారం డ్రాఫ్ట్ ఆర్డర్​ను పబ్లిష్ చేసింది. భారత్ తమ వస్తువులపై పెద్ద మొత్తంలో టారిఫ్​లు వేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన 25% ప్రతీకార సుంకాలు ఈ నెల 7 నుంచి అమలులోకి వచ్చాయి.

అయితే, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు భారత్​కు పెనాల్టీగా మరో 25% టారిఫ్​లు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. బుధవారం నుంచి ఈ అదనపు టారిఫ్​లూ అమలులోకి వస్తాయని హోంల్యాండ్ సెక్యూరిటీ సంస్థ నోటిఫికేషన్ లో పేర్కొంది. దీంతో సుంకాలు మొత్తం 50 శాతానికి చేరాయి. 

సుంకాల పెరుగుదలతో భారత్ నుంచి అమెరికాకు వివిధ వస్తువుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రధానంగా టెక్స్ టైల్స్, రొయ్యలు, జువెలరీ, లెదర్, ఫుట్ వేర్, కెమికల్స్, యానిమల్ ప్రొడక్టుల రంగాలకు ఇబ్బందికరంగా మారనుంది. ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ సుంకాల వల్ల భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది. బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక, కంబోడియా, ఇండోనేషియా వంటి పోటీదారుల వస్తువులపై చాలా తక్కువ సుంకం ఉంది. పెరిగిన సుంకాలు అమల్లోకి రాకముందే అమెరికాకు ఎగుమతులను పెంచేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు చైనా కూడా రష్యా ఆయిల్ కొంటున్నా, ఆ దేశంపై అమెరికా 30% టారిఫ్​లు మాత్రమే విధించింది.