బడా గణేశ్ నిమజ్జనంపై అటెన్షన్

బడా గణేశ్ నిమజ్జనంపై  అటెన్షన్
  • ప్రతి ఏడాది నిమజ్జనం చూసేందుకు తరలివస్తున్న లక్షల మంది
  • మూడేండ్లుగా నిమజ్జనం  జరిగే చోట తోపులాటలు 
  • చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జీలు  
  • ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ 
  • పోలీసులు ఎలా మేనేజ్​ చేస్తారోననే టెన్షన్​

హైదరాబాద్​ సిటీ, వెలుగు : ఖైరతాబాద్ బడా గణపతి అంటేనే దేశమంతా క్రేజ్​ఉంటుంది. ప్రతిష్ఠించినప్పటి నుంచి మొదలునిమజ్జనం చేసేంతవరకు ఈ గణేశుడే హాట్​టాపిక్​గా ఉంటాడు. ముంబైలోని లాల్​బాగ్​చా రాజా గణేశ్​తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులున్న గణేశుడు ఖైరతాబాద్ ​గణపతే..సుమారు 70 అడుగులుండే ఈ మహా గణపతిని తప్పనిసరిగా దర్శించుకోవాలని భక్తజనం ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతిష్ఠించిన చోట దర్శనం చేసుకోలేని వారు శోభాయాత్ర, నిమజ్జనం చేసేప్పుడైనా చూసి తరించాలని  ఆశపడుతుంటారు. 

దర్శనం చేసుకున్న వారు కూడా అంత పెద్ద గణపతిని హుస్సేన్​సాగర్​లో ఎలా వేస్తున్నారో చూడాల్సిందేనని తరలివస్తుంటారు. అలాగే, హుస్సేన్​సాగర్ ​వద్దకు ఇతర నిమజ్జనాలు చూడడానికి వచ్చే వారు కూడా బడా గణేశ్ నిమజ్జన ఘట్టాన్ని   చూడకుండా వెళ్లరు. ఈ కారణాలతో ఏడాదికేడాది మహా గణపతి శోభాయాత్రతో పాటు నిమజ్జనంలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో శోభాయాత్రలో తోపులాట, నిమజ్జనం జరిగే చోట నిలబడేంత స్థలం లేక తోసుకువస్తుండడంతో స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వస్తున్నది.  

తోపులాటలు..లాఠీచార్జీలు 

బడా గణేశ్​ నిమజ్జనాన్ని వీక్షించడానికి తరలివచ్చే లక్షల మంది భక్తులకు నిలబడడానికి తక్కువ స్థలమే అందుబాటులో ఉంది. ఒకవైపు హుస్సేన్​సాగర్, మరోవైపు ఎన్టీఆర్​గార్డెన్, ​మధ్యలో రోడ్డు ఉండడంతో అందులోనే సర్ధుకపోవాల్సి వస్తున్నది. ఇది తోపులాటకు దారి తీస్తున్నది.  దీంతో మీదపడేవారిని, తోసుకుంటున్నవారిని కంట్రోల్​ చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేస్తున్నారు. అయితే, అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదమూ చోటు చేసుకోలేదు. 

కానీ, ఈ ఏడాది సంధ్య థియేటర్​దగ్గర సినీ నటుడు అల్లు అర్జున్​ను చూడడానికి తరలివచ్చిన అభిమానులు కూడా తోసుకోవడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. మరొక బాలుడు కోలుకోలేని స్థితిలో ఉన్నాడు. మూడేండ్ల పరిస్థితిని పరిశీలించి శోభాయాత్రతో పాటు నిమజ్జనం దగ్గర పోలీసులు మరింత అలర్ట్​గా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.   

మూడేండ్లల్లో నిమజ్జనం జరిగిందిలా.. 

2022లో పర్యావరణహిత 50 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించి సెప్టెంబర్​9న శోభాయాత్ర, నిమజ్జనం నిర్వహించారు. దీనికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నిమజ్జనం జరిగే చోట తోసుకోవడంతో స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. 2023లో 63 అడుగుల గణేశుడిని ఏర్పాటు చేసి సెప్టెంబర్​28న శోభాయాత్ర నిర్వహించారు. సుమారు 6 గంటల పాటు కొనసాగి హుస్సేన్​సాగర్​తీరంలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కూడా తోపులాట జరిగి సేమ్ ​సీన్ ​రిపీటయ్యింది. 2024 సెప్టెంబర్​17న నిర్వహించిన శోభాయాత్ర, నిమజ్జనానికి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. శోభాయాత్ర మండపం నుంచి ప్రారంభమైనప్పటి నుంచే వేల సంఖ్యలో భక్తులు వెంట వచ్చారు. 

సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ లో భక్తులు తోసుకోవడం కనిపించింది. గణేశ్ ​విగ్రహం ముందు, వెనక నడిచేందుకు వచ్చిన భక్తులను కంట్రోల్ ​చేయడానికి పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. రెండంచెల్లో రోప్​పార్టీలు ఉన్నా లోపల ఉన్నవారిపైనే దృష్టి పెట్టి బయటివారిని బయటకే తోసెయ్యడంతో వారు కిందపడ్డారు. పిల్లలు, వృద్ధులు స్వల్పంగా గాయపడ్డారు. నిమజ్జనం జరిగే హుస్సేన్​సాగర్​ తీరంలో ప్లేస్ ​లేకపోవడంతో ఎన్టీఆర్ ​మార్గ్​లోని ఫుట్​ఓవర్​ బ్రిడ్జిపై వేల సంఖ్యలో భక్తులు నిలబడ్డారు. కొంతమంది వేలాడారు. దీంతో ఆ బ్రిడ్జి ఎక్కడ కూలిపోతుందోనని కంగారుపడాల్సి వచ్చింది. ఏమీ కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిమజ్జనం నిర్వహించిన చోటికి తోసుకురావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పి కంట్రోల్​చేశారు. 

 ఇప్పటి పరిస్థితి ఏంటి? 

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈసారి పక్కాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శోభాయాత్రలో, నిమజ్జన పాయింట్ ​వద్ద ప్రత్యేక యాక్షన్ ​ప్లాన్ ​అమలు చేయాల్సిన అవసరం ఉంది. భక్తులు లక్షల్లో వచ్చే అవకాశం ఉండడంతో వారిని కంట్రోల్​ చేయాలంటే కొన్ని కఠిన చర్యలు తీసుకోక తప్పదు. ఫుట్​ఓవర్ ​బ్రిడ్జీలు, డివైడర్లు, లైట్ల కోసం ఏర్పాటు చేసిన స్టాండ్స్, చెట్లు, ఇతర చోట్ల జనం ప్రమాదకరంగా నిల్చోకుండా చూడాలి. నిమజ్జనం జరిగే చోటుకు బడా గణేశ్ ​రాకుముందే అక్కడకు చేరుకునే జనాలను అంచనా వేసి ఎక్కువ మంది చేరకుండా  జాగ్రత్తలు తీసుకోవాలి. లాఠీఛార్జి చేసి చెదరగొట్టాల్సిన అవసరం రాకుండా  యాక్షన్​ ప్లాన్​ ఉండాలని భక్తులు కోరుతున్నారు.