ఖైరతాబాద్ బడా గణేష్ అప్ డేట్: ఐదవ రోజు పెరిగిన రద్దీ... భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లు..

ఖైరతాబాద్ బడా గణేష్ అప్ డేట్: ఐదవ రోజు పెరిగిన రద్దీ... భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లు..

హైదరాబాద్ కా షాన్ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఐదవ రోజు భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం ( ఆగస్టు 31 ) ఉదయం గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు గణేషుడిని దర్శించుకునేందుకు వచ్చారు.3 క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఇవాళ సుమారు 3 లక్షల మంది భక్తులు  గణేషుడిని దర్శించుకునేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ పెరిగిన క్రమంలో ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు.

శనివారం ( ఆగస్టు 30 ) సుమారు రెండు లక్షల మంది భక్తులు గణేషుడిని  దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి  దాకా సుమారు 5 లక్షల మంది భక్తులు బడా గణేషుడిని దర్శించుకున్నట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. బడా గణేషుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో.. ఇవాళ రాత్రి 11:45 గంటల దాకా మెట్రో రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.

బడా గణేశుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.ప్రస్తుతం 3 క్యూ లైన్లలో భక్తులు బారులు తీరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. 

1954లో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహా వినాయకుడు ఈ ఏడాదితో 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 69 అడుగులతో కొలువుదీరిన స్వామి కి ఇరువైపుల కుడి పక్క శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ పక్క ...కన్యక పరమేశ్వారి, శ్రీ గజ్జాలమ్మ దేవి కొలువుదీరి చూడటానికి వేయి కళ్ళు చాలవన్నట్లు దర్శనమిస్తున్నాడు బడా గణేశుడు.ఏడు దశాబ్దాలుగా ఖైరతాబాద్ లో కొలువు తీరుతున్న మహా గణపతిని శిల్పి రాజేంద్రన్ రూపుదిద్దుతున్నారు.