తొలి పూజ అందుకున్న ఖైరతాబాద్ గణేష్

తొలి పూజ అందుకున్న ఖైరతాబాద్ గణేష్

ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజలు అందుకున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు  శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతికి ప్రథమ పూజ నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారికి వెండి హారంను సమర్పించారు దానం నాగేందర్. అయితే గవర్నర్ దంపతులతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శాలువాతో సత్కరించారు దానం నాగేందర్.

ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ నరసింహన్…. ఖైరతాబాద్ గణేష్ పూజ తెలంగాణకు ఎంతో ప్రత్యేకమైనది అన్నారు.  9 ఏళ్లుగా ప్రతి ఏడాది ఇక్కడికి రావడం అలవాటుగా మారిందన్నారు.  గణేశుడిని పూజిస్తే తెలంగాణకు ఎప్పుడు కూడా ఏ విఘ్నం రాదన్నారు. నరసింహన్ తొలి పూజల తర్వాత భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తున్నారు కమిటీ సభ్యులు.

61 అడుగుల ఎత్తులో దర్శనమిస్తున్న వినాయకుడిని  దర్శించుకునేందుకు,  భక్తులు  పెద్ద  సంఖ్యలో  తరలివస్తున్నారు.  దీంతో  ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడుతోంది. తొలి పూజ ముగియటంతో భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు.

12 తలలు,  ఏడు అశ్వాలు,  12 సర్పాలతో…  61 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు కనువిందు చేస్తున్నాడు. వినాయ కుడి వైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి.. ఎడమ వైపున బ్రహ్మా, విష్ణు, మహేశ్వర సమేత దుర్గాదేవి కొలువదీరారు. ఒక్కో తలకు ఒక్కో రకమైన రంగుతో గణనాథుడు రూపుదిద్దుకున్నాడు. ఈ రూపంలో వినాయకుడిని పూజిస్తే.. సకాలంలో వర్షాలు పడి, అందరికీ మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 4 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 40 సీసీ కెమేరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.