ఖైరతాబాద్‌‌లో ట్రాఫిక్ జాం.. దూరం నుంచే దర్శనం చేసుకోవాలి

ఖైరతాబాద్‌‌లో ట్రాఫిక్ జాం.. దూరం నుంచే దర్శనం చేసుకోవాలి

ఖైరతాబాద్ లో బడా గణేష్ చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో ఈ రద్దీ మరింత పెరిగింది. వీరిని అదుపు చేయడం కోసం పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. త్వరగా దర్శనం చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గంట గంటకు భక్తుల రద్దీ అధికమౌతుండడంతో దూరం నుండే దర్శనం చేసుకోవాలని భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు. పోలీసులు సూచిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సాయంత్రం జరగాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. 

భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రద్దీని క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ సమేతంగా వేలాదిగా తరలివస్తుండడంతో క్యూలైన్ లు కిటకిటలాడుతున్నాయి. అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో తరచూ కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పటికీ రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు.