- ఇబ్బందికరంగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ
- అనర్హత వేటుకు ముందే రాజీనామా యోచన?
- స్పీకరు కలిసి గడువు కోరనున్న ఎమ్మెల్యే
- ఎల్లుండి రిజైన్ చేస్తారని ప్రచారం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేస్తారని తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. రెండో సారి కూడా నోటీసు అందుకున్న దానం నాగేందర్ ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.నోటీసుల గడువు రేపటితో ముగియనుంది. రేపు ఆదివారం కావడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. కడియం శ్రీహరి నిన్ననే స్పీకర్ ను కలిసి మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై పోటీ చేసినందున ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో అనర్హత వేటు పడకముందేతన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.
►ALSO READ | కళాకారులు ఎంతమంది ఉన్న అందెశ్రీ కోహినూర్ వజ్రంలా నిలుస్తడు: సీఎం రేవంత్
ఇందులో భాగంగా ఇవాళ ఉదయం అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో స్పీకర్ గడువు కోరి, ఆ తర్వాత రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిన్న, మొన్నదానం నాగేందర్ ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయినట్టు సమాచారం. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపి స్తానని, పదవి వదులుకుంటున్నందుకు తనకు రాజ్యసభ సభ్యత్వం లేదా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ హోదా కల్పించాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాతే స్పష్టత ఇస్తా మని దానం నాగేందర్ కు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ చేరుకున్న దానం శ్రీధర్ బాబును కలిసినట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం గడువు కోరి సోమవారం స్పీకర్ కు రాజీనామా పత్రం సమర్పిస్తారని సమాచారం. ఏది ఏమైనా హైదరాబాద్ నగరంలో మరో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం అటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
