హైదరాబాద్: సమాజంలో ఎన్ని వజ్రాలు ఉన్న కోహినూర్ వజ్రానిదే అసలైన గొప్పతనమని.. అలాగే కళాకారులు ఎంత మంది ఉన్న అందులో అందె శ్రీ కోహినూర్ వజ్రంలా నిలుస్తాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడికి వెళ్ళని అందెశ్రీ జయ జయ హే తెలంగాణ గీతం రాసిన చరిత్ర తెలంగాణకు ఉందన్నారు. శనివారం (నవంబర్ 22) రవీంధ్రభారతిలో జరిగిన అందెశ్రీ సంస్మరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
గద్దరన్న, గూడ అంజన్న, అందెశ్రీ, గోరెటి వెంకన్న వంటి కవులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారారని.. వీళ్లంతా గళం విప్పితేనే తెలంగాణ కల నెరవేరిందని అన్నారు. తెలంగాణ ప్రాంతం ఎంత ప్రేమ చూపిస్తుందో.. అంటే పోరాటాన్ని కూడా చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులూ ఎన్నో పోరాటాలు చేశారని.. గతంలో నిజాం సర్కార్ వాళ్ళను సైతం ఎదురొడ్డి పోరాడిన చరిత్ర తెలంగాణకు ఉందని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రతి నాలుక, ప్రతి వేదిక మీద నిలిచిన జయ జయ హే తెలంగాణ పాటకు గౌరవం దక్కాలని ప్రజలు కోరుకున్నారని.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గేయంగా గుర్తించామని చెప్పారు. గత బీఆర్ఎస్ పాలకుల చర్యలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నింపిన కవులు, రచయితలను కించపరిచే విధంగా ఉన్నాయని విమర్శించారు.
►ALSO READ | ఐబొమ్మ రవి కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ డీసీపీ కవిత ట్రాన్స్ఫర్
పెన్నే కదా మన్ను గప్పితే.. గన్ను అయినట్లు తెలంగాణ పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. అందె శ్రీ, గద్దర్ అన్న లాంటి వాళ్ళ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కవులు, రచయితల కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇందులో భాగంగానే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఉద్యమ కారులను గుర్తించి వాళ్లకు సహయం చేశామన్నారు.
అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కుటుంబాలకు ఇండ్లు నిర్మించి అండగా నిలుస్తామని చెప్పారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానిదన్నారు. వర్గీకరణ అనేది ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా ఉండాలని.. అందుకే సమాజాన్ని ముందుకు నడిపించాలానే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో మంత్రి వర్గంలో దళితులకు పెద్ద పీట వేశామన్నారు .
