ఆశ్రయం కోసం ట్రైనింగ్ ఇస్తున్న బ్రిటన్ లాయర్లు
డెయిలీ మెయిల్ కథనం వెల్లడి
లండన్: బ్రిటన్‌కు అక్రమంగా వలస వెళ్లిన ఇండియన్లకు అక్కడి లాయర్లు తప్పుడు మార్గాలను నేర్పిస్తున్నారు. శరణార్థిగా అక్కడ ఆశ్రయం దొరకాలంటే ఖలిస్థానీ మద్దతుదారులమని వాళ్లతో చెప్పిస్తున్నారు. వాళ్లకు ఇండియాలో ప్రాణహాని ఉందనే సాకు చెప్పి, ఖలిస్థానీ సభ్యులుగా చూపించి ఆశ్రయం కల్పిస్తున్నారు. మైగ్రేషన్ చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని లాయర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తన సీక్రెట్ ఆపరేషన్‌లో తేలిందని గురువారం డెయిలీ మెయిల్ పత్రిక వెల్లడించింది.
వాపస్ పోలేమని చెప్పిస్తున్నరు..
చిన్న చిన్న పడవల్లో యూకేలోకి అక్రమంగా ఎంటర్ అయిన మనోళ్లకు ఇండియాలో ప్రాణహాని ఉందని, వెనక్కి వెళ్లే పరిస్థితులు లేవని అక్కడి కోర్టులను లాయర్లు నమ్మిస్తున్నారు. అందుకు.. మన దేశంలో ప్రేమ వ్యవహారం వికటించిందని, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నామని, లేదంటే స్వలింగ సంపర్కులు, ఖలిస్థానీ మద్దతుదారులమని, రైతు ఉద్యమాల్లో పాల్గొన్నామని చెప్పిస్తున్నారు. ఈ కారణాలతో ఇండియాకు వెళ్లాలంటే ప్రాణభయం ఉందన్నట్లు జడ్జిల ఎదుట నటించాలని ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇందుకు ఒక్కో లాయర్ 5,500 నుంచి 10,000 యూరోలదాకా వసూలు చేస్తున్నారు. ఆ రకంగా బ్రిటన్ లో శరణార్థులుగా ఉండేందుకు ఆశ్రయం కల్పిస్తున్నారని డెయిలీ మెయిల్ తెలిపింది. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న 40కి పైగా న్యాయ సంస్థలపై అధికారులు దర్యాప్తు చేపట్టారని పేర్కొంది.
ALSO READ:జేసీబీల్లో వాగులు దాటిన గర్భిణులు
రుషి సునాక్ ట్వీట్
డెయిలీ మెయిల్ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌ను బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ట్వీట్ చేశారు. శరణార్థులను చట్టవిరుద్ధంగా దేశంలోకి తీసుకొచ్చే వ్యవస్థను ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. లేబర్ పార్టీ నేతలు, లాయర్లు, క్రిమినల్ గ్యాంగ్ ల వైపే ఉన్నారని ఆరోపించారు. సునాక్ కామెంట్లను అక్కడి బార్ కౌన్సిల్ చైర్ పర్సన్ కొట్టిపారేశారు. లాయర్లు అలా చేస్తున్నట్లు ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
