
- ఖమ్మం అడిషనల్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ
- ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులపై సమీక్ష
- 26 ఆస్పత్రుల తనిఖీ కోసం 4 బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడి
ఖమ్మం టౌన్,వెలుగు : ఈనెల 26 లోగా ఖమ్మం జిల్లాలో ఉన్న 26 ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులను తనిఖీ చేసి రిపోర్ట్ సమర్పించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఉన్న 26 ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులను తనిఖీ చేసేందుకు డీసీపీఓ, డీవైఎస్ఓ, డీడబ్ల్యూఓ, ఏడీ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రతి బృందంలో వైద్య శాఖకు సంబంధించిన ప్రోగ్రామ్ అధికారులు, సీనియర్ అసిస్టెంట్, ఇతర వైద్య సిబ్బంది ఉంటారని చెప్పారు.
ప్రతి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రి భవన ప్లాన్, ఆక్యూపెన్సి సర్టిఫికెట్, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ శాఖ ఎన్ఓసీ, బ్లడ్‌బ్యాంక్ లైసెన్సు, ఆస్పత్రి భవనం ఎత్తు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికెట్, బయో మెడికల్ వేస్టేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఏపీఎంసీఈ, ఫార్మసీ లైసెన్సు, అంబులెన్స్ ఫిట్నెస్ రిజిస్ట్రేషన్, పీసీపీఎన్ డీటీ యాక్ట్ రిజిస్ట్రేషన్ లాంటి అన్ని పత్రాలు పరిశీలించాలన్నారు. ఆస్పత్రిలో ఉన్న ఇన్ ఫ్రా, ఎక్విప్మెంట్, స్టాఫ్ తదితర వివరాలపై ఆరా తీయాలని చెప్పారు. ప్రతి ఆస్పత్రికి సంబంధించి తనిఖీ సమయంలో గుర్తించిన మేజర్, మైనర్ పొరపాట్లు సంబంధించి సంపూర్ణ వివరాలు రిపోర్ట్ లో ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ బి,కళావతి బాయి, డీవైఎస్ఓ సునీల్ రెడ్డి, డీడబ్ల్యూఓ. కె. రాంగోపాల్ రెడ్డి, సీడీపీఓ విష్ణువందన తదితరులు పాల్గొన్నారు.