
- ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మం టౌన్, వెలుగు : పత్తి, ధాన్యం పండించిన రైతులకు మద్దతు ధర లభించేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో వానాకాలం ధాన్యం కొనుగోలు సన్నద్ధత, కపాస్ కిసాన్ యాప్ పై సంబంధిత అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాబోయే వానాకాలంలో జిల్లాలో 2.60 లక్షల వేల టన్నుల సన్న ధాన్యం, 40 వేల టన్నుల దొడ్డు ధాన్యం కొనుగోలు లక్ష్యం ఉందన్నారు. సన్న ధాన్యం కొనుగోలుతో పాటు 4 నెలల లోపు మిల్లింగ్ చేయాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అన్ని యంత్రాలను అందుబాటులో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి క్లస్టర్ పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఏఈవో సర్టిఫై చేయాలని చెప్పారు. రైతులకు గన్నీ బ్యాగులను ముందే ఇచ్చే పద్ధతి మారాలన్నారు. అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పత్తి కొనుగోలు సులభతరం చేసే కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మార్కెటింగ్ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి మాట్లాడుతూ బహిరంగ మార్కెట్ లో పత్తి ధర పడిపోతున్న నేపథ్యంలో కనీస మద్దతు ధర చెల్లించి సీసీఐ ద్వారా కొనుగోలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.
నాణ్యమైన పత్తి పంట క్వింటాల్ రూ.8,110 మద్దతు ధర చెల్లిస్తుందని చెప్పారు. పత్తి రైతులు మార్కెట్ కు వచ్చి ఇబ్బందులు పడకుండా ఇంటి వద్ద నుంచి స్లాట్ బుక్ చేసుకునేలా కపాస్ కిసాన్ యాప్ లో సౌకర్యం కల్పించామన్నారు. పత్తి కొనుగోలు సంబంధిత సేవలకు రైతులు టోల్ ఫ్రీ నెంబర్ 18005995779, వాట్సప్ 8897281111 నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అలీమ్, జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎం శ్రీలత, అధికారులు, ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.