వేర్వేరు చోట్ల ఇద్దరు హత్య.. ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో ఘటనలు

వేర్వేరు చోట్ల ఇద్దరు హత్య.. ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో ఘటనలు
  •  ఖమ్మంలో అనుమానంతో భార్యను చంపిన భర్త
  • సిద్దిపేట జిల్లాలో పాత గొడవల కారణంగా బాబాయిని హత్య చేసిన యువకుడు

ఖమ్మంటౌన్‌‌, వెలుగు : భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో గురువారం జరిగింది. పోలీసులు, మృతురాలి తల్లి రమణ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన గోగుల భాస్కర్‌‌కు ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన సాయి వాణి (35)తో 15 ఏండ్ల కింద వివాహమైంది. 

వీరికి ఇద్దరు పిల్లలు. భాస్కర్‌‌ మద్యం, జల్సాలకు అలవాటు పడడం, భార్యపై అనుమానం పెంచుకోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో సాయివాణి తన ఇద్దరు పిల్లలతో ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఫంక్షన్‌‌హాల్‌‌లో పనిచేస్తోంది. భార్యపై అనుమానం, కోపం పెంచుకున్న భాస్కర్‌‌ కత్తి తీసుకొని గురువారం ఉదయం 7 గంటల టైంలో సాయివాణి ఉండే ఇంటి వద్దకు వచ్చాడు.

 సాయివాణి తలుపులు తీసిన వెంటనే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అడ్డొచ్చిన కుమార్తె పైనా దాడి చేయడంతో ఆమె చేతులు, మెడ పైభాగంలో గాయాలయ్యాయి. కుమారుడు ఇంట్లో నుంచి పారిపోయి స్థానికులకు విషయం చెప్పడంతో వారువచ్చి భాస్కర్‌‌ను పట్టుకొని టూటౌన్‌‌ పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న టూ టౌన్‌‌ సీఐ బాలకృష్ణ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాబాయిని చంపిన యువకుడు

గజ్వేల్/వర్గల్, వెలుగు : పాత గొడవలను మనసులో పెట్టుకున్న ఓ యువకుడు తన బాబాయిని హత్య చేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్‌‌ మండలం నాచారంలో గురువారం జరిగింది. గజ్వేల్‌‌ రూరల్‌‌ సీఐ మహేందర్‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరాఠీ లక్ష్మయ్య (60)కు అతడి అన్న కొడుకు రమేశ్‌‌ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. 

నెల రోజుల కింద ఇద్దరి మధ్య గొడవ జరగడంతో విషయం పోలీస్‌‌స్టేషన్‌‌ వరకు వెళ్లింది. గురువారం ఉదయం లక్ష్మయ్య భార్య లక్ష్మి బయటకు వెళ్లగా.. ఇంట్లో అతడు ఒక్కడే ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత రమేశ్‌‌ గ్రామంలోని ఓ ఆర్‌‌ఎంపీ వద్దకు వెళ్లి.. ‘మా బాబాయ్ సడన్‌‌గా కిందపడిపోయాడు.. అస్వస్థతగా ఉన్నాడు’ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. 

ఆర్ఎంపీ వచ్చి చూడగా.. లక్ష్మయ్య తలపై గాయం ఉండడంతో వెంటనే హాస్పిటల్‌‌కు తరలించాలని సూచించడంతో తూప్రాన్‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. అక్కడ లక్ష్మయ్యను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. 

సమాచారం అందుకున్న గజ్వేల్‌‌ రూరల్‌‌ సీఐ మహేందర్‌‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రమేశ్‌‌పై అనుమానం వచ్చి విచారించగా... అతడే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రమేశ్‌‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.