సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం, వెలుగు: మెరుగైన సేవలతో ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం కలిగించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో సాధారణ ప్రసవాల పెంపు, ఆస్పత్రుల పనితీరుపై అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆశా కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ గర్భిణులను ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న వసతులను వినియోగించుకుంటూ ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. 

పీహెచ్​సీ వైద్యాధికారులతో వెంటనే సమావేశం నిర్వహించాలని, ప్రతి ఏరియాలో ఆ నెల ఎన్ని ప్రసవాలు జరిగే అవకాశం ఉంటుందో వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఆస్పత్రి నుంచి చేసిన రెఫరెన్స్ ఫాలో అప్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు రెఫర్ చేయడానికి వీలులేదన్నారు. పెండింగ్ ఉన్న ఆస్పత్రి భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, కావాల్సిన వైద్యపరికరాలు, మౌలిక సదుపాయాలు ఏర్పరచుకొని ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్​వో రామారావు,  డీసీహెచ్ఎస్ రాజశేఖర్ పాల్గొన్నారు. 

 కార్పొరేట్ దీటుగా విద్యను అందించాలి

వైరా :   వైరా మున్సిపాలిటీలోని గుట్టబడి ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును కలెక్టర్ అనుదీప్​ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్స్​తో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాన్ని పరిశీలించారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ ద్వారా విద్యా ప్రమాణాల పెంపుదలతో విద్యార్థులకు మంచి భవిష్యత్​ లభిస్తుందని, దీనిపై టీచర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్​సూచించారు.  

ఈ కార్యక్రమ పర్యవేక్షణకు యాప్ తయారు చేశామని, దీనిని యూడీఐఎస్​తో అనుసంధానం చేయడంతో ఎటువంటి డాటా ఎంట్రీ అవసరం ఉండదని, ప్రతీ బుధవారం విద్యార్థి రీడింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అప్ డేట్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో దీక్షారైనా, విద్యా శాఖ సీఎంఓ ప్రవీణ్, వైరా తహసీల్దారు శ్రీనివాసరావు, హెడ్ మాస్టర్లు, టీచర్లు పాల్గొన్నారు.