ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం : అనుదీప్ దురిశెట్టి

ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం : అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్/పాల్వంచ, వెలుగు :  పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, జితేశ్​ వి పాటిల్​ అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  వారు పాల్గొన్నారు. 

ఖమ్మం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్​ నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, లావణ్య. స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మితో కలిసి హాజరయ్యారు.  అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ  పంచాయతీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ వచ్చిన ప్రతీ దరఖాస్తు పరిశీలించి తప్పని సరిగా అర్హులకు పోస్టల్ బ్యాలెట్ అందించాలని, ప్రతి గ్రామం, మండలాల వారీగా వివరాలు సేకరించి సంబంధిత రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేలా చూడాలన్నారు.

మొదటి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ఓటు హక్కు ఉండి ఎన్నికలు విధులు నిర్వహించే సిబ్బంది డిసెంబర్ 8న, రెండవ విడత వారికి 12న, మూడవ విడత వారికి 15న ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ , సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద  మైక్రో అబ్జర్వర్ నియామకం  చేయాలన్నారు.