
- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు, టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు నమోదు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ఎఫ్ఆర్ఎస్ విధానంలో హాజరు నమోదుపై విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. టీచర్లకు సెలవు మంజూరు సమయంలో పాఠాలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
టీచర్ల డిప్యూటేషన్ పై రివ్యూ నిర్వహించాలని సూచించారు. ఎక్కడా టీచర్ కొరత లేకుండా చూడాలన్నారు. కేజీబీవీల్లో ఎఫ్ఆర్ఎస్ 77 శాతం ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది పని తీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు.
సఖి కేంద్రం పరిశీలన
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలోని సఖి కేంద్రం, వన్ స్టాప్ సెంటర్, షీ టీమ్, భరోసా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భరోసా, సఖి కేంద్రాలలోని న్యాయ సలహా, మెడికల్, చిన్నారుల, కౌన్సిలింగ్ స్టేట్‌మెంట్ రికార్డింగ్ చేసే గదులను, రిజిస్టర్ రికార్డ్ లను పరిశీలించారు. సఖి కేంద్రాల ద్వారా మహిళల హక్కులపై అవగాహన కల్పించాలని, అన్యాయానికి గురైన బాధితులకు అండగా భరోసా కేంద్రాలు రక్షణ కల్పిస్తాయని ఆయన అన్నారు.
ఇప్పటివరకు 2,338 కేసులకు వివిధ రకాల న్యాయ సేవలు అందించినట్లు నిర్వాహకులు కలెక్టర్‌కు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఆర్. అరుణ, కో-ఆర్డీనేటర్ జి. రాజకుమారి తదితరులు ఉన్నారు.