
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : పిల్లల రీడింగ్ స్కిల్స్ పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరెట్ లో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదివేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. చింతకాని మండలంలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసిన 5 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు రీడింగ్ సామర్థ్యం పెంచేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ట్రయల్ రన్ చేయనున్నట్లు వివరించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు చదివేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఒక పీరియడ్ రీడింగ్ సామర్థ్యం కోసం కేటాయించాలని సూచించారు. నేటి (మంగళవారం) నుంచి ఎవ్రీ చైల్డ్రీడ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో విద్యాశాఖ ప్లానింగ్ కో–ఆర్డినేటర్ సీహెచ్ రామకృష్ణ, సీఎంవో ప్రవీణ్, అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి..
ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని, వెంటవెంటనే సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 80 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్కూల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులపై టీజీఈడబ్ల్యూఐడీసీ సీఈ షఫీమియా, అధికారులతో సమీక్షించారు.