
- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : ఏటీసీ కోర్సులతో యువతకు ఉపాధి భరోసా లభిస్తుందని, జిల్లాల్లోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ గా అప్ గ్రేడ్ చేయగాఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏటీసీ నూతన భవనంలో ఏర్పాటు చేస్తున్న అధునాతన మిషనరీని పరిశీలించారు.
పరికరాల పనితీరును ట్రైనర్స్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలపై పలు సూచనలు చేశారు. ఐటీఐలు ఇప్పుడు కొత్త సాంకేతికతతో టాటా టెక్నాలజీస్ సహకారంతో యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణను అందించనున్నట్టు తెలిపారు.
క్రీడాకారులకు అభినందన
కలెక్టరేట్ లోని తన చాంబర్ లో కలిసిన క్రీడాకారులతో కలెక్టర్ మాట్లాడారు. హన్మకొండలో ఈనెల 3, 4న జరిగిన 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్, సీనియర్ విభాగం అథ్లెటిక్స్ పోటీల్లో ఖమ్మంలోని స్యాట్ జి (ఎస్ఏ టీజీ) అకాడమీ , ఖమ్మం జిల్లా క్రీడాకారులు పాల్గొని 23 బంగారు, 11 రజత,11 కాంస్య పతకాలు సాధించారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలో పతకాలు సాధించిన క్రీడాకారులను తీర్చిదిద్దిన కోచ్ ఎండీ గౌస్ ను కలెక్టర్ సన్మానించారు. జిల్లా క్రీడా అధికారి సునీల్ రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎండీ షఫీక్ అహ్మద్ ఉన్నారు.
పశు వైద్యశాల తనిఖీ
ఖమ్మం బైపాస్ రోడ్ రాపర్తినగర్ లోని ప్రభుత్వ జిల్లా పశు వైద్యశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులు, స్కానింగ్ రూం, శస్ర్తచిక్సితల థియేటర్, ఆస్పత్రిలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. వర్షాలు పడుతున్నందున మూగజీవాలు వ్యాధుల బారినపడే అవకాశం ఉందని, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ సరైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. జిల్లా పశువైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్. వి. శ్రీనివాసరావు, సీనియర్ వైద్యులు డాక్టర్. కె. కిషోర్ ఉన్నారు.
జ్యూట్ బ్యాగులను ఉపయోగించాలి
ఖమ్మం : ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, జ్యూట్ బ్యాగులను ఉపయోగించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఖమ్మం నగరంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల ఆధ్వర్యంలో రూపొందించిన జ్యూట్ బ్యాగులను కలెక్టరేట్ లో ఆయన ఆవిష్కరించారు. స్మార్ట్ కిడ్జ్ పాఠశాల ఆధ్వర్యంలో ఐదేండ్లుగా ప్రతి సంవత్సరం జ్యూట్ బ్యాగులను తయారు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు అందించడం అభినందనీయమన్నారు. స్మార్ట్ కిడ్జ్ పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య, పాఠశాల ప్రిన్సిపల్, టీచర్లు పాల్గొన్నారు