
- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, మున్సిపాలిటీ తదితర శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. జిల్లాకు మంజూరైన అంగన్వాడీ కేంద్రాల్లో 41 గానూ 40, గ్రామ పంచాయతీ భవనాలు 101 గానూ 70 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. 30 జీపీ బిల్డింగ్స్, 1 అంగన్వాడీ కేంద్రం నిర్మాణం పూర్తయిందని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి జిపి బిల్డింగ్స్, అంగన్వాడీ కేంద్రాలన్నీ అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. 11 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ల్లో5 పూర్తి చేశామని చెప్పారు.
ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుతం సొంత భవనాలలో ఉన్న 940 అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్స్ కల్పించాలన్నారు. రఘునాథపాలెం మండలంలో మంజూరైన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మధిర, పాలేరు ప్రాంతాలలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఏర్పాటు ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. ఖమ్మం నగరం పరిధిలో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్వహణ, రిపేర్లు చేపట్టాలన్నారు. సీడీపీ, ఎస్ డీఎఫ్, ఎంపీ ల్యాడ్స్ కింద గతంలో మంజూరు చేసి గ్రౌండ్ కాని పనులను రద్దు చేయాలని ఆదేశించారు.
అభివృద్ధి పనుల బిల్లులు సమర్పించే సమయంలో ఇసుక చలాన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. టేకులపల్లి డైట్ కాలేజీ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయని, వీటికి అవసరమైన సవరణ అంచనా ఆమోదింపజేసుకొని మార్చి లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఓ ఏ. శ్రీనివాస్, డీఆర్డీవో సన్యాసయ్య, డీడబ్ల్యూఓ రాంగోపాల్ రెడ్డి, ఎస్ఈలు యాకోబు, వెంకట్ రెడ్డి, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, మున్సిపల్, మిషన్ భగీరథ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్
ఖమ్మం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అటవీ సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు. అటవీ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. వన్యప్రాణి రక్షణ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 2022లో భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ గా ఉన్న సమయంలో శ్రీనివాస్ రావు అనే అటవీ అధికారి అకాల మరణం చెందారని, వారి మరణం తనను చాలా కలిచి వేసిందని గుర్తు చేశారు. కొత్తగూడెం జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసే సమయంలో అటవీ పరిరక్షణ మీద అనేక సమస్యలు పరిశీలించానని చెప్పారు. అడవుల సంరక్షణకు నిర్విరామంగా కృషి చేస్తున్న అటవీశాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.