భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి..ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి..ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

జిల్లాలో పురోగతిలో ఉన్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, 
భూ సేకరణ సమస్యలపై సమీక్ష 

ఖమ్మం టౌన్, వెలుగు :  జాతీయ రహదారుల నిర్మాణ పనుల భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో జాతీయ రహదారుల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం- దేవరపల్లి, నాగపూర్- అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. 

ఖమ్మం- దేవరపల్లి రహదారికి ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎక్జిట్ పాయింట్ కోసం 6.22 ఎకరాల భూసేకరణ చేయాలన్నారు. ఇందులో 3.16 ఎకరాలకు ఇప్పటికే అవార్డ్ పాస్ చేసినట్లు, మిగతా 3.06 ఎకరాలకు భూసేకరణ కు చర్యలు వేగవంతం చేయాలని చెప్పారు. మేజర్ బ్రిడ్జి, వీయూపీలు ఈ నవంబర్ లోగా, ఆర్ఓబీ డిసెంబర్ లోగా పూర్తి చేయాలన్నారు. కొదుమూరు వద్ద 400 కేవీ ఈహెచ్ టీ షిప్టింగ్ పనులు రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు సమావేశమై పూర్తిచేయాలన్నారు. 

నాగపూర్- అమరావతి ప్యాకేజి-1, 2 భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబర్ లోగా పరిహార చెల్లింపులు పూర్తిచేసి, భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఎన్ హెచ్ఏఐ పీడీలు రామాంజనేయ రెడ్డి, దివ్య, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు.. 

జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.ఉదయం సెషన్ లో చేపట్టిన థియరీ పరీక్షకు 129 మంది అభ్యర్థులకు గాను 128 మంది అభ్యర్థులు హాజరు కాగా, ఒకరు గైర్హాజరు అయ్యారని చెప్పారు. 

మధ్యాహ్నం నిర్వహించిన ప్లాటింగ్ పరీక్షకు 205 మంది అభ్యర్థులకు గాను 202 మంది హాజరుకాగా, ముగ్గురు గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, సీపీఓ ఏ. శ్రీనివాస్ లు 
చేపట్టారన్నారు.