
- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు :కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతికి కావాల్సిన భూ సేకణ పై కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ మనోజ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్టారావు తో కలిసి జిల్లా కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తన క్యాంపు కార్యాలయం నుండి పాల్లొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో కాజీపేట - విజయవాడ రైల్వే మూడవ లైన్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ తుది దశలో ఉందని తెలిపారు.
ఈ భూ సేకరణ పూర్తి కావడమే ప్రాజెక్ట్ వేగవంతానికి కీలకమతుందని అన్నారు. ఈ మూడవ లైన్ పూర్తి అయితే రైళ్ల రాకపోకలు వేగవంతం అవుతాయని, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా చెన్నై మార్గాల్లో ట్రాఫిక్ తగ్గిపోతుందని వివరించారు. రైళ్ల ఆలస్యం తగ్గిపోవడంతో ప్రయాణికులకు, అలాగే పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు నాటికి పనులు పూర్తి చేసి, ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని, భూ సేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ దురిశెట్టి ఆదేశించారు.ఈ సమీక్ష లో రెవెన్యూ, సర్వే విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.