
- మధిరలో ఏర్పాట్లను పరిశీలించిన ఖమ్మం కలెక్టర్ అనుదీప్
- శిక్షణకు హాజరు కానివారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
- మధిర మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం
మధిర, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. మధిర మండలం ఖాజీపురం గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు.
కౌంటింగ్ కేంద్రంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, లాజిస్టికల్ సదుపాయాలపై పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించేందుకు సంబంధిత విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కేంద్రంలో శుభ్రత, విద్యుత్ సదుపాయాలు, పార్కింగ్ లాంటి అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ప్రిసైడింగ్ అధికారులకు సూచనలు
మధిర పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్‌లో జరుగుతున్న ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల తొలి విడత శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శిక్షణ పొందుతున్న అధికారులకు ఎన్నికల విధుల నిర్వహణలో జాగ్రత్తలు, నిష్పక్షపాత వైఖరి, సమయపాలనపై సూచనలు చేశారు. శిక్షణకు హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మధిర మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ బూత్‌ల వారీగా చేపట్టిన సమీక్షలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
పోలింగ్ రోజు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ, అడిషనల్ పోలీస్ కమిషనర్ ప్రసాదరావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ సన్యాసయ్య, ఆర్డీవో నరసింహారావు, మధిర తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు, మధిర రూరల్ సీఐ మధు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ అరిగెల సంపత్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉండాలి
తల్లాడ : నిరంతరం సీసీ కెమెరాలతో స్ట్రాంగ్ రూమ్ ల వద్ద నిఘా ఉంచాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. బుధవారం తల్లాడ మండలం రెడ్డి గూడెం క్రీస్తు జ్యోతి జూనియర్ కాలేజ్ లో స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాటు ను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.