ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతా ప్రజలు అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతా ప్రజలు అలర్ట్ గా ఉండాలి  : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు :  మొంథా తుపాన్ ప్రభావం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో మున్నేరు వరద ప్రవాహం పెరుగుతున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది, లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండాల‌ని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్డి సూచించారు. గురువారం నగర మేయర్ పునకొల్లు నీరజ, అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. 

లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి ధంసలాపురం పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్,  నయాబజార్ కళాశాల్లో పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. నయాబజార్ స్కూల్, నయాబజార్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను  కలెక్టర్ తనిఖీ చేశారు. వసతులు, భోజనం నాణ్యత, హెల్త్ క్యాంప్ ను పరిశీలించారు. కలెక్టర్ ​వెంట డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, మున్సిపల్, పోలీస్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. 

ప్రజలను ఆదుకోవాలి 

మొంథా తుఫాన్ నేపథ్యంలో మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాలలో  క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొంథా తుఫాన్ సహాయక చర్యలపై గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి పాల్గొని జిల్లా పరిస్థితిని  వివరించారు. ఖమ్మం నగరం పరిధిలో మున్నేరు నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో 90 కుటుంబాల పరిధిలో 227 సభ్యులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. వారికి  అవసరమైన ఆహారం, పారిశుధ్యం, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 

సహాయక చర్యల్లో ఆపద మిత్రలు కీలకపాత్ర 

మొంథా తుఫాన్ సహాయక చర్యల్లో ఆపద మిత్రలు కీలకపాత్ర పోషించారని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లాలో 300 మంది యువతకు ఆపదమిత్ర లుగా ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చామన్నారు. ఖమ్మం నగరంలో లేఔట్ అనుమతుల జారీ అంశంలో నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అనంతరం కేఎంసీ ఆఫీస్​లో నిర్వహించిన లే అవుట్ కమిటీ సమావేశం నిర్వహించారు. 

పెండింగ్ లో ఉన్న లేఔట్ అనుమతులపై కలెక్టర్ సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ ఇతర లైన్ డిపార్ట్​మెంట్ అధికారులతో చర్చించి, ప్రతి లే అవుట్ దరఖాస్తుకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి రిమార్క్స్, అభ్యంతరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఉన్న దరఖాస్తుల ప్రాంతాలను సాంకేతికతను వినియోగిస్తూ గతంలో అక్కడ ఏమైనా నీటి వనరులు ఉన్నాయా లాంటి అంశాలను స్వయంగా పరిశీలించారు. లేఔట్ అనుమతులను నిబంధనల ప్రకారం జారీ చేయాలని చెప్పారు.