- ఖమ్మం కలెక్టర్ అనుదీప్
- చింతకాని, బోనకల్ మండలాల ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల తనిఖీ
మధిర, వెలుగు : -పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులకు సూచించారు. ఈనెల11న మొదటి విడతలో నిర్వహించే గ్రామ పంచాయతీల ఎన్నికల సందర్భంగా చింతకాని, బోనకల్ మండలాల్లో కలెక్టర్ మంగళవారం పర్యటించారు. చింతకానిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బోనకల్ మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
పోలింగ్ సామగ్రిని, పోస్టల్ బ్యాలెట్ పత్రాలను, పూర్తి సామగ్రి ఉందో లేదో ఎలా సరిచూసుకోవడం, బ్యాలెట్ బాక్స్, ఓటర్ లిస్ట్, బ్యాలెట్ పేపర్స్ చెక్ చేసుకోవడం, పోలింగ్ రోజున ఉదయమే సిబ్బంది పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకునేలా వాహనాల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. అనంతరం నాగులవంచ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల ముందు రోజు ఎన్నికల సామగ్రి సేకరించడం, ఛాలెంజ్ ఓటు, టెండర్ ఓటు, బ్యాలెట్ పేపర్స్ ఇవ్వడం, పీవో డైరీ నింపడం, అన్ని ఫార్మ్స్ ఎలా నింపాలి, ఏజెంట్స్ సిగ్నేచర్ ఎక్కడ తీసుకోవాలి, పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీలింగ్, ఓట్స్ కౌంటింగ్, సర్పంచ్ నియామక పత్రాలు ఇవ్వడం, తదితర అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు వారికి ఏర్పాటు చేసిన చోటనే బస చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన సిబ్బంది విధులకు హాజరయ్యేలా రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రిటర్నింగ్ అధికారులు నవీన్ బాబు, కె.విజయభాస్కరరెడ్డి, చింతకాని తహసీల్దార్, బోనకల్ తహసీల్దార్ పద్మ, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

