- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లాలో ఇసుక పంపిణీని పూర్తి పారదర్శకంగా చేపట్టేందుకు ఆన్‌లైన్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ (ఓటీపీఎస్) వెబ్, మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెడుతున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మాన్యువల్ పద్ధతిలో ఇసుక పంపిణీని పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఇసుక రీచ్‌లు, వాటి లభ్యతపై జాయింట్ తనిఖీలు నిర్వహించి, కచ్చితమైన డేటాను సోమవారం నాటికి అప్లికేషన్‌లో మ్యాపింగ్ చేయాలని సూచించారు.
సరసమైన ధరకే నాణ్యమైన ఇసుకను సకాలంలో అందిస్తే వినియోగదారులు ప్రైవేటు వ్యక్తుల వద్దకు వెళ్లే అవకాశం ఉండదని, మొదటగా ఇందిరమ్మ ఇండ్లు, గృహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు. అప్లికేషన్ పనితీరుపై క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని, ఇందుకోసం ఎంపీడీఓలు మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు, రవాణాదారులకు వర్క్‌షాప్‌లు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ కార్యదర్శుల క్షేత్రస్థాయి తనిఖీ, ఆమోదం తర్వాతే తహసీల్దార్లు టోకెన్లు జారీ చేస్తారని వివరించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాధాకృష్ణ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఆర్వో పద్మశ్రీ, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
ప్రజలకు సత్వర న్యాయం అందేలా అధికారులు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం నిధుల్లో 60 శాతం కేటాయించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు తర్వాత 45 రోజుల్లో గ్రౌండింగ్ కాకపోతే వాటిని రద్దు చేసి కొత్త ప్రతిపాదనలు తీసుకోవాలని, నిరుపేదలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి ఆదుకోవాలని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ స్లాట్లను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, భూభారతి పోర్టల్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్లు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, 60 రోజులకు పైబడి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 70 గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియను చేపట్టాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి లెక్క తేల్చాలన్నారు. చింతకాని నర్సింగ్ కళాశాల, మధిర ఐటీ హబ్ లాంటి అభివృద్ధి పనులకు భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అధికారుల పనితీరును నిరంతరం అంచనా వేస్తామని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఆర్వో పద్మశ్రీ, ఆర్డీఓ నర్సింహారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
