ఖమ్మంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు :  ఇసుక, మట్టి అక్రమ రవాణా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో అడిషనల్​ కలెక్టర్  పి. శ్రీనివాస రెడ్డి, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, సంబంధిత అధికారులతో నిర్వహించిన డీఎస్ఆర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 

మండలాల వారీగా గ్రామీణ ప్రాంతాల పరిసరాల్లో అందుబాటులో ఉన్న ఇసుక వనరులపై సర్వే రిపోర్టులు తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందుతోందని, అనుమతుల మేరకే ఇసుక రవాణా జరిగేలా పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణాను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు పెంచాలని ఆదేశించారు.  

కలెక్టర్ తో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ 

జాతీయ రహదారుల నిర్మాణాలు అయ్యేలా  పెండింగ్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అన్నారు. ఈ అంశంపై  శనివారం హైదరాబాద్ నుంచి సీఎస్​ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఖమ్మం నుంచి కలెక్టర్  అనుదీప్ మాట్లాడుతూ  ఎన్ హెచ్ 163జి పరిధిలో ఖమ్మం జిల్లాలో కోర్టు స్టే ముగిసినందున 12  కిలో మీటర్ల మేర రోడ్డు వేసేందుకు 42 హెక్టార్ల భూసేకరణ స్పీడప్​ చేసి అక్టోబర్ చివరి నాటికి ఎన్ హెచ్ఏకు భూ బదలాయింపు చేస్తామని చెప్పారు. కొదుమూరులో పెండింగ్ ఉన్న 7.39 హెక్టార్ల భూ బదలాయింపు రాబోయే 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.