ఖమ్మంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు ..15 రోజుల్లో గుంతలన్నీ పూడ్చాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు ..15 రోజుల్లో గుంతలన్నీ పూడ్చాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • ఖమ్మం కలెక్టర్ అనుదీప్​ దురిశెట్టి 

ఖమ్మం టౌన్, వెలుగు  : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లో బుధవారం నిర్వహించిన 8వ జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో స్థానిక మున్సిపాలిటీలు బాధ్యతలు తీసుకొని రోడ్ల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం నగరంలో 10 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి రోడ్ల గుంతలను పూడ్చి వేసినట్లు తెలిపారు.

 అలాగే కల్లూరు, వైరా, సతుపల్లి, మధిర, ఏదులాపురం మున్సిపాలిటీల పరిధిలో ప్రధాన రోడ్లపై ఉన్న గుంతలను 15 రోజులలో పూడ్చాలని ఆదేశించారు. నేషనల్ హైవే 365బీబీ ఖమ్మం నగరానికి బైపాస్ గా ఉంటుందని, ఖమ్మం బైపాస్ వద్ద రిపేర్లు చేపట్టాలని, రంబుల్ స్ట్రిప్స్, రేడియం స్టిక్కర్, స్పీడ్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఖమ్మం -కోదాడ, వరంగల్ జంక్షన్ పరిధిలో ఉన్న స్ట్రెచ్ ను ఆర్ అండ్ బీ అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. 

వైరా లో ఒక అపార్ట్ మెంట్ రోడ్డుపై సివరేజి వదలడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవు తున్నాయని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే సంబంధిత యాజమాన్యాలకు నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. మున్సిపల్, ఎన్ హెచ్, రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బీ అధికారులు కలిసి అక్టోబర్ 24న  బైపాస్ నుంచి కలెక్టరేట్ వరకు ఫీల్డ్ విజిట్ చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అక్టోబర్ 29 నాటికి రిపోర్ట్ అందించాలని కలెక్టర్ ఆదేశించారు. 

సీపీ సునీల్ దత్ మాట్లాడుతూ ఎన్ హెచ్ కనెక్టింగ్ రోడ్డు, టీ-జంక్షన్  వద్ద ఎన్​హె చ్ తరఫున రంబుల్ స్ట్రిప్స్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో పార్కింగ్ లేకుండా నూతన పాఠశాలలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వవద్దని చెప్పారు. అడిషనల్​కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ నేషనల్ హైవే వద్ద జరిగిన ప్రమాదాల దృష్ట్యా బ్లాక్ స్పాట్స్ గుర్తించి వాటి సమీపంలో  ఉన్న ఆస్పత్రులకు మ్యాచ్ చేయాలన్నారు. 

కేఎంసీ కమిషనర్ అభిషేక్ మాట్లాడుతూ వర్షాల అనంతరం నగర కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన రోడ్లపై  ఏర్పడిన 470 గుంతలను గుర్తించి ఇప్పటి వరకు 350 పూడ్చేశామన్నారు. సమావేశంలో డీఆర్​డీఓ ఏ. పద్మశ్రీ, ఆర్ అండ్ బీ ఎస్ఈ యాకుబ్, డీఎంహెచ్​వో కళావతి బాయి, జిల్లా రవాణా అధికారి వెంకట రమణ,  నేషనల్ హై వే పీడీలు రామాంజనేయ రెడ్డి, దివ్య తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అభివృద్ధికి ప్రణాళిక

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శ్రీజతో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.

మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మధిర మండలం మహదేవపురం జడ్పీహెచ్ఎస్,  చింతకాని మండలం నాగులవంచ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పాఠశాలల హెడ్ మాస్టర్ లు వెంటనే  పాఠశాల అభివృద్ధి నిర్వహణ కమిటీ పేరిట ప్రత్యేక బ్యాంక్ ఖాతా ప్రారంభించాలని, దీనికి లీడ్ బ్యాంకు మేనేజర్ అవసరమైన సహకారం అందించాలన్నారు. 

ఖమ్మం సమగ్ర శిక్ష ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ డెమో ప్రాజెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ పేరిట కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి  ఉపయోగించేలా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పారు. నూతనంగా వచ్చిన రూ.7.18 కోట్లను డెమో ప్రాజెక్టు స్కూల్ ఎడ్యుకేషన్ జాయింట్ అకౌంట్ లో జమ చేసేందుకు ప్లానింగ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని ముఖ్య ప్రణాళిక అధికారిని ఆదేశించారు.

 రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను సమగ్ర శిక్ష అభియాన్ ప్లానింగ్ కోఆర్డినేటర్, మండల విద్యాశాఖ అధికారులు సంబంధిత పాఠశాలల హెడ్ మాస్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి స్టడీ చేయాలని సూచించారు.  ఈనెల 26 నాటికి మొదటి విడత కింద  ప్రతి పాఠశాలకు రూ.20 లక్షలు విడుదల చేయాలన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ బనిగండ్లపాడులో అభివృద్ధి పనులకు అక్టోబర్ 25 న డిప్యూటీ సీఎంతో శంకుస్థాపన  చేయించాలన్నారు. 

రీడింగ్ స్కిల్స్ పెరిగేలా..

ప్రతి విద్యార్థి రీడింగ్ స్కిల్స్ పెరిగేలా  ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అవగాహన కార్యక్రమంలో  అడిషనల్​ కలెక్టర్ శ్రీజ, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తూ మౌళిక వసతులు, అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని కలెక్టర్​ తెలిపారు.