తుఫాన్ నష్టంపై నివేదిక సమర్పించాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీజ

తుఫాన్ నష్టంపై నివేదిక సమర్పించాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీజ
  • ఖమ్మం స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ శ్రీజ 

ఖమ్మం టౌన్, వెలుగు :  నిర్ణీత నమూనాలో తుఫాన్ నష్టం అంచనా నివేదిక సమర్పించాలని ఖమ్మం స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె మొంథా తుఫాన్ నష్టం అంచనాల నివేదికలు తయారీపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మొంథా తుఫాన్ తో  జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలు ఈనెల 6 లోపు అందించాలన్నారు. 

వ్యవసాయ అధికారులు, ఏఈఓ క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని చెప్పారు. జిల్లాలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్లు ఎంత మేరకు డ్యామేజ్​ అయ్యాయే గుర్తించి, తాత్కాలిక రిపేర్లకు, శాశ్వత రిపేర్లకు ఎంత ఖర్చు అవుతుందో వివరాలు సమర్పించాలని ఆదేశించారు. దెబ్బతిన్న ఇండ్ల సంఖ్య, చనిపోయిన పశువులు, గొర్రెలు, పౌల్ట్రీ,  పోల్స్, ట్రాన్స్ ఫార్మర్, చెరువులు, కాల్వలు, నీటివనరుల వివరాలు సమర్పించాలన్నారు. డీఆర్ఓ ఏ. పద్మశ్రీ, సీపీఓ ఏ. శ్రీనివాస్, ఇర్రిగేషన్, ఆర్ అండ్ బీ, పీఆర్ ఎస్ఈలు, ఆయా శాఖల ఆఫీసర్లు ఉన్నారు.