మీ ఆశయ సాధనకు కృషి చేస్తా : తుమ్మల నాగేశ్వరరావు

మీ ఆశయ సాధనకు కృషి చేస్తా : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు : ‘పేద ప్రజల అభ్యున్నతి కోసం పోరాడుతున్న మీ ఆశయాల సాధనకు కృషి చేస్తాను. నాకు మద్దతు ఇవ్వండి’ అని మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీని కోరారు. సోమవారం పట్టణంలోని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా ఆఫీస్​లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లను తుమ్మల మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో, ఖమ్మంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించేందుకు తనకు మద్దతు అవసరమన్నారు. దీనికి రంగారావు స్పందిస్తూ దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్​ఎస్​ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పోరాడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీలకు వ్యతిరేఖంగా పోరాడి గెలిచే పార్టీలకు, వ్యక్తులకు తమ మద్దతు ఉంటోందని స్పష్టం చేశారు. 

సిటీలో ర్యాలీ.. 

సిటీలోని 46,47,48 డివిజన్ల లో నిర్వహించిన ర్యాలీలో తుమ్మల మాట్లాడారు. గోళ్లపాడు ఛానల్  అభివృద్ధికి తన హయాంలో రూ.70 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభిస్తే,  దాన్ని అధికార పార్టీ నాయకులు రూ.170 కోట్లకు అంచనాలు పెంచుకుని, రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పువ్వాడ ఓట్ల రాజకీయం కోసం ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక్కరోజు ముందు హడావుడిగా శంకుస్థాన చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.

ప్రజల రక్షణ కోసం ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న మున్నేరు కరకట్ట నిర్మాణాన్నితాను గెలిచిన నెలరోజుల్లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు ఇచ్చో, బెదిరించో రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజలు సరైన బుద్ధి చెబుతారని పువ్వాడను ఉద్దేశించి అన్నారు. అజయ్ ముస్లింల నోటి కాటి కూడు లాక్కున్నాడని విమర్శించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్​ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయం సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు.