విలీన గ్రామాల సమస్యలపై ఖమ్మం కార్పొరేషన్ ముట్టడి

విలీన గ్రామాల సమస్యలపై ఖమ్మం కార్పొరేషన్ ముట్టడి

ఖమ్మం: విలీన గ్రామాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కార్పొరేషన్ ముట్టడి నిర్వహించారు సీపీఐ ఎంఎల్ (CPI ML) ప్రజాపంథా నాయకులు. ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. విలీన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో విలీన గ్రామ పంచాయతీల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్తున్నాయని ఈ సందర్భంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

రోడ్ల పక్కన సైడ్ డ్రైనేజీలు లేక రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని, వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. వర్షాకాలంలో పాదచారులు సైతం ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని.. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్ల పక్కన డ్రైనేజీ కాలువలు, రహదారులు సరిగా లేని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య సమస్యలు పేరుకుపోతుండడం వల్ల ఇబ్బందిపడుతున్నందున వెంటనే పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. 

వర్షా కాలంలో అస్తవ్యస్త పరిస్థితుల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే పరిస్థితులు ఏర్పడ్డాయని.. ప్రజలు సామూహికంగా రోగాల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. విలీన గ్రామాల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు సీపీఐఎంఎల్ ప్రజాపంథా నాయకులు.