
- 13 గోల్డ్ మెడల్స్ తో టాప్ ప్లేస్
- ముగిసిన స్టేట్ లెవల్ పోటీలు
హనుమకొండ, వెలుగు: తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ స్టేట్ లెవల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది. 13 గోల్డ్, 3 సిల్వర్, 5 బ్రాంజ్ పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచింది. హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజులపాటు జరిగిన 11వ స్టేట్ లెవల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి దాదాపు 1,400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో వేర్వేరుగా జావెలిన్ త్రో, 500 మీటర్ రన్, 5 కి.మీ రేస్ వాక్, 10 కి.మీ రేస్ వాక్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ ఇలా మొత్తం 131 ఈవెంట్లు నిర్వహించగా, అథ్లెట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా, అండర్ 20 బాయ్స్, గర్ల్స్ లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది. అండర్ 18 బాయ్స్ లో మహబూబ్ నగర్ చాంపియన్ గా నిలవగా, గర్ల్స్ విభాగంలో ఖమ్మం విజయం సాధించింది. అండర్ 16 బాయ్స్ లో రంగారెడ్డి, గర్ల్స్ విభాగంలో హనుమకొండ జిల్లా సత్తా చాటాయి. ఖమ్మం జిల్లా 21 పతకాలతో ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించగా, 16 పతకాలతో హైదరాబాద్, చెరో 14 మెడల్స్ తో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఓవరాల్ గా 23 పతకాలు సాధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 4 గోల్డ్, 10 సిల్వర్, 9 బ్రాంజ్ మెడల్స్ సాధించి టాప్-5 లో చోటు దక్కించుకుంది.
లాస్ట్ లో మేడ్చల్, వరంగల్ జిల్లాలు..
మొత్తం 131 ఈవెంట్లలో ఛాంపియన్ గా ఖమ్మం జిల్లా నిలవగా, మేడ్చల్ జిల్లా ఒక్క పతకం సాధించకపోవడంతో చివరిస్థానంలో నిలిచింది. వరంగల్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే ఒక బ్రాంజ్ మెడల్ సాధించి చివరి స్థానాల్లో నిలిచాయి. ములుగు, జోగులాంబ గద్వాల జిల్లాలు ఒక్కో సిల్వర్ మెడల్ సాధించాయి. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన అథ్లెట్లు సెప్టెంబర్ 9 నుంచి 12 వరకు పాండిచ్చెరిలో జరిగే సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.