వార్డులవారీగా ఓటర్ల జాబితా రెడీ!

వార్డులవారీగా ఓటర్ల జాబితా రెడీ!

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని 37 గ్రామాల  వార్డుల వారీగా ఓటర్ల లెక్క తెలినట్లు ఎంపీడీవో అశోక్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎంపీడీఓ ఆఫీస్ లో ఓటర్లు, పోలింగ్ స్టేషన్ల వివరాలపై ఆయా గ్రామ పార్టీల లీడర్లతో నిర్వహించిన సమావేశంలో అశోక్ మాట్లాడారు. మండలంలోని 37 గ్రామాల్లో 308 వార్డులకు గానూ 40,790 మంది ఓటర్లు నమోదైనట్లు పేర్కొన్నారు. వీరిలో పురుష ఓటర్లు 19,420, మహిళా ఓటర్లు 21,366 మంది, ఇతరులు నలుగురు ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ఉస్మాన్ షరీఫ్, ఎంపీఓ తదితరులు పాల్గొన్నారు. 

ములకలపల్లి : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని రాజకీయ పార్టీల మండల బాధ్యులతో ఎంపీడీవో రామారావు సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా లో తప్పొప్పులు, పోలింగ్ స్టేషన్ల మార్పుల లాంటి విషయాలపై ఎంపీడీవో నాయకులతో చర్చించారు. చౌటిగూడెం యూపీఎస్ లో ఉన్న  పోలింగ్ కేంద్రాన్ని చోటిగూడెం కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయాలని కోరారు.  గుర్రాలకుంట, చింతలపాడు గ్రామాల ఓటర్లు పేర్లు పూసుగూడెం గ్రామపంచాయతీలో ఉన్నాయని, వాటిని  సీతారాంపురం గ్రామపంచాయతీలోకి మార్చాలని అధికారుల దృష్టికి తెచ్చారు. 

జూలూరుపాడు : మండలంలోని అన్ని పంచాయతీలకు సంబంధించిన  ఓటర్ల లిస్టులో తప్పొప్పులు, పోలింగ్ బూత్​ల మార్పులపై ఎంపీడీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, మార్పుచేర్పులను పరిశీలించిన ప్రతినిధులు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారని ఎంపీడీవో తాళ్లూరి రవి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ తులసీరాం, నాయకులు పాల్గొన్నారు.

పెనుబల్లి : పెనుబల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలో కొత్తగా యువజన ఓటర్లు చేర్చాలని, ఇక్కడ నుంచి వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి ఓట్లను తొలగించాలని పార్టీల ప్రతినిధులు కోరారు. దీనికి ఎంపీడీవో అన్నపూర్ణ స్పందిస్తూ ఇప్పట్లో చేరికలు, తొలగింపులు లేవని, పంచాయతీలో ఒక వార్డులో ఉండాల్సిన ఓటర్లు వేరే వార్డులో ఉంటే వారి ఓటు బదిలీ చేసే ఆప్షన్ మాత్రమే ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో జ్యోష్నాదేవి, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.