- విరిగిన బాలిక నడుము, చేతులు
- రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన బాలిక
- నిందితుడిపై పోక్సో కేసు.. అరెస్ట్
- ఖమ్మంలో ఘటన
ఖమ్మం టౌన్, వెలుగు: 12 ఏండ్ల బాలికపై లైంగికదాడికి యత్నించిన దుండగుడు.. ఆమె కేకలు వేయడంతో తానెక్కడ పట్టుబడతానేమోనని మూడో అంతస్తు నుంచి నెట్టేశాడు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న బాలిక స్పృహలోకి రావడంతో ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఖమ్మంలో ఈ నెల 6న జరిగింది. ఖమ్మం ఏసీపీ రమణమూర్తి కేసు వివరాలను మంగళవారం మీడియాకు తెలిపారు.
ఖమ్మంలోని రాపర్తినగర్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న 12 ఏండ్ల బాలికపై అక్కడే ఉంటున్న కారు డ్రైవర్ లైంగికదాడికి యత్నించాడు. బాలిక రెండవ ఫ్లోర్‌నుంచి పైకి వెళ్తుండగా ఆమెను లాక్కెళ్లాడు. ఆ బాలిక కేకలు పెట్టడంతో ఎవరైనా వస్తే దొరికిపోతానన్న భయంతో గౌస్ మూడో అంతస్తు నుంచి కిందకు నెట్టేసి పారిపోయాడు. కిందపడి తీవ్రంగా గాయపడిన బాలికను ఆమె తల్లి, అమ్మమ్మ ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. ఆమె అపస్మారక స్థితిలో ఉండడంతో ప్రమాదవశాత్తు పడిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు.
మంగళవారం కోలుకున్న బాలిక.. జరిగిన విషయాన్ని తల్లికి, మేనమామకు చెప్పడంతో వారు ఖమ్మం టూ టౌన్ పోలీసుస్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ఆమె స్టేట్మెంట్నురికార్డు చేసుకున్న పోలీసులు నిందుతుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసినట్టు ఏసీపీ రమణమూర్తి, సీఐ బాలకృష్ణ చెప్పారు. ప్రమాదంలో బాలిక వెన్నుముక, పక్కటెముకలు విరిగిపోయాయని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు.
ఆమె కోలుకున్న తర్వాత భరోసా కేంద్రానికి తరలించి, వైద్య పరీక్షలు చేయిస్తామని, అత్యాచారం జరిగినట్టు తేలితే మరిన్ని సెక్షన్లు చేరుస్తామని పోలీసులు చెప్పారు. కాగా, మైనర్‌పై లైంగికదాడికి యత్నించిన వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ లీడర్ ఆవుల అశోక్ డిమాండ్ చేశారు.
పాపను కాపాడుకుందాం: మంత్రి పొంగులేటి
దుండగుడి చేతిలో సెక్సువల్ హరాస్‌మెంట్‌కు గురైన బాలికను కాపాడుకుంటామని, ఆమెను నిమ్స్‌కు తరలించి అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఘటన గురించి తెలియగానే బాలిక తండ్రితో, స్థానిక సర్పంచ్‌తో ఫోన్ లో మాట్లాడారు.
‘ముందు పాపను కాపాడుకుందాం, అధైర్య పడకండి.. మీకు అండగా నేనున్నా’ అని ధైర్యం చెప్పారు. పాప వైద్య ఖర్చులన్నింటినీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని భరోసానిచ్చారు.
