ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

అన్నపురెడ్డిపల్లి, వెలుగు: రాష్ట్రంలో మెరుగైన విద్య, వైద్యానికి రానున్న బడ్జెట్ లో 40 శాతం ఫండ్స్ కేటాయించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు.  మంగళవారం అన్నపురెడ్డిపల్లి మండలంలో పాదయాత్ర చేశారు. ముందుగా స్థానిక భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ స్కూల్స్ లో పని చేసే డైలీవేజ్ కార్మికులు మల్లన్నను కలిసి తమకు 12 నెలలుగా జీతాలు రావడంలేదని, రెగ్యులర్ చేస్తామన్న హామీ అమలు కాలేదని చెప్పారు. స్పందించిన మల్లన్న మంత్రి సత్యవతి రాధోడ్ తో ఫోన్ లో మాట్లాడి సమస్య ను వివరించారు. మంత్రితో కార్మికులను మాట్లాడించారు. తనని కలిస్తే సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం ఓటు హక్కును దుర్వినియోగం చేయొద్దని సూచించారు. రీకాల్  చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేసేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తాగి పడేసిన మద్యం సీసాలతో పాలన కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు.  వెంకటాపురం గ్రామ గిరిజనులు పోడు భూముల సర్వే సరిగా నిర్వహించలేదని, సీతారామ ప్రాజెక్టు  నిర్మాణ ముంపులో పోయిన భూముల డబ్బులు నేటికీ రాలేదని చెప్పారు. కాల్వ నిర్మాణం జరగని భూముల్లో పంటలు సాగు చేయనీయడంలేదని ఆవేదన వ్యక్తం  చేశారు. డబ్బులు రానప్పుడు ఆ భూముల్లో పంటలు  సాగు చేసుకోవాలని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ ప్రయత్నం

సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఉందని తీన్మార్ మల్లన్న మీడియాకు తెలిపారు. ఒక వేళ అసెంబ్లీ రద్దు చేస్తే తీన్మార్ మల్లన్న టీమ్​ కేసీఆర్ ఎత్తుగడల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఆయన వెంట దాసరి భూమయ్య, సుదర్శన్  ఉన్నారు. 

గొత్తి కోయలను తరిమేస్తే సహించేది లేదు

దమ్మపేట, వెలుగు: గుత్తికోయలను తరిమేయాలని చూస్తే సహించేది లేదని ఆదివాసీ నాయకులు తెలిపారు. మంగళవారం దమ్మపేటలో ఆదివాసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇద్దరు చేసిన తప్పుకు గొత్తికోయలందరినీ బలవంతంగా వెళ్లగొట్టాలనుకోవడం సరైంది కాదన్నారు. గొత్తి కోయలకు ఆదివాసీ సంక్షేమ పరిషత్  అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తుందని సంఘం రాష్ట్ర కోశాధికారి కొర్సా వెంకటేష్ దొర తెలిపారు. 
చండ్రుగొండ: ఎర్రబోడు గొత్తికోయలను గ్రామ బహిష్కరణ చేస్తూ తీర్మానం చేయడం సరైంది కాదని, వారి పట్ల వివక్ష చూపడం తగదని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వజ్జా సురేశ్  అన్నారు. మంగళవారం ఎర్రబోడును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఆర్వోను హత్య చేయడం బాధాకరమన్నారు. హత్యకు కారుకులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.  గుర్రాయిగూడెం సర్పంచ్ సీత, టీఏజీఎస్  నాయకులు కోటేశ్వరావు, నాగేశ్వరావు, రమేశ్, రామకృష్ణ, హనుమంతు, పాపారావు పాల్గొన్నారు.

అంజన్నకు అభిషేకం.. రామయ్యకు కల్యాణం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం ఆంజనేయస్వామికి అభిషేకం జరిగింది. స్వామికి సమస్త నదీజలాలు, పంచామృతాలతో తిరుమంజనం చేసి అప్పాలు, నిమ్మకాయల మాలలను నివేదించారు. హనుమాన్​ చాలీసా పారాయణం జరిగింది. అంతకుముందు గోదావరి నుంచి తీర్థబిందె తెచ్చి గర్భగుడిలో సీతారాముల మూలవరులకు సుప్రభాతసేవ చేసి బాలబోగం నివేదించారు. అనంతరం కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం జరిపించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం, సాయంత్రం దర్బారు సేవ జరిగింది. 

స్థానికులకే ‘డబుల్’ ఇండ్లు ఇవ్వాలి

కామేపల్లి, వెలుగు: గ్రామాన్ని వదిలి వెళ్లిన వారికి డబుల్  బెడ్రూమ్  ఇండ్లు మంజూరు చేయడంపై మంగళవారం మండలంలోని సాతానిగూడెం గ్రామస్తులు రెవెన్యూ ఆఫీసర్లను నిలదీశారు. గ్రామ పంచాయతీ ఆఫీసులో 50 డబుల్  ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించారు. ఎన్నో ఏళ్ల కింద గ్రామం వదిలి వెళ్లిన వారిని ఎంపిక చేశారని ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేస్తామని తహసీల్దార్  కృష్ణ చెప్పినా వినకపోవడంతో గ్రామసభను వాయిదా వేశారు. సర్పంచ్ నాగమణి, మండల స్పెషల్ ఆఫీసర్ రవిబాబు, ఆర్ఐ మౌనిక, పంచాయతీ కార్యదర్శి అనిల్  పాల్గొన్నారు.

ఉప్పల్​ ఎమ్మెల్యేపై ఆగ్రహం

వేంసూరు, వెలుగు: ఉప్పల్​ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి వ్యాఖలను యాదవ​సంఘం నాయకులు ఖండించారు. మండల కేంద్రంలో యాదవ, కురుమ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అద్యక్షుడు నూనె హరిబాబు యాదవ్​ మాట్లాడుతూ చర్లపల్లి కార్పొరేటర్​ బొంతు శ్రీదేవి యాదవ్​పై అహంకారంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. మండల అధ్యక్షుడు జట్టి రామారావు, జీవీకే ప్రసాద్, కన్నారావు, రమేశ్, సురేశ్, పుల్లయ్య పాల్గొన్నారు.

కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

ఖమ్మం టౌన్, వెలుగు: సీఎస్టీని రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా రైస్  మిల్లర్స్  అసోసియేషన్  ఆధ్వర్యంలో మంగళవారం కేసీఆర్  ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. అసోసియేషన్  జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జవ్వాజి నరేశ్, సహాయ కార్యదర్శి బొమ్మ మధు కుమార్, ఈసీ మెంబర్స్ సత్యనారాయణ, బొమ్మ సత్యం, బవిరిశెట్టి మల్లికార్జున్  పాల్గొన్నారు.

బస్తీ దవాఖానా ప్రారంభించిన ఎమ్మెల్యే

సత్తుపల్లి, వెలుగు: నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రూ.53 కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. మంగళవారం పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో రూ.9 లక్షలతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. 23 మందికి సీఎంఆర్ఎఫ్, 18 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్  చెక్కులను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్, వైస్  చైర్​పర్సన్ తోట సుజల రాణి, లైబ్రరీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు, ఆత్మ కమిటీ చైర్మన్  హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు.