
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లాలో అవినీతికి పాల్పడిన విద్యుత్ ఏఈ ఆర్. భాస్కర్ రావు, అసిస్టెంట్ లైన్ మెన్ యు.జగత్ జీవన్ సస్పెండ్ అయ్యారు. తిరుమలాయపాలెం మండలం చింతల్ తండా కు చెందిన కొందరు రైతుల వద్ద కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు రూ. లక్ష లంచం డిమాండ్ చేసి రూ. 90 వేలు తీసుకున్నారు.
బాధిత రైతుల ఫిర్యాదుతో విద్యుత్ విజిలెన్స్ విచారణ లో లంచం తీసుకున్నది వాస్తవమేనని తేలడంతో భాస్కర్ రావు, జగత్ జీవన్ ను సస్పెండ్ చేసినట్టు శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి మంగళవారం తెలిపారు. ఇద్దరు ఉద్యోగులపై శాఖా పరమైన ఎంక్వైరీ చేస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, లంచం డిమాండ్ చేస్తే.. 9281033233 నంబర్ కు ఫోన్ చేసి కంప్లయింట్ చేయాలని ఎస్ఈ సూచించారు.