
అశ్వారావుపేట, వెలుగు: అక్రమంగా నల్లబెల్లాన్ని వ్యాన్ లో తరలిస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించగా టాటా వ్యాన్ లో 4,104 కేజీల నల్ల బెల్లం, 30 కేజీల పట్టిక, 10 లీటర్ల నాటు సారాను గుర్తించారు.
అందులో ఉన్న ఏపీలోని తూర్పుగోదావరి కు చెందిన కొడమంచిలి క్రాంతి, సవరపు రవిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శ్రీహరి తెలిపారు. పట్టుబడిన బెల్లాన్ని ఏపీలోని తణుకు నుంచి అశ్వారావుపేట తరలిస్తున్నట్లుగా తేలింది. పట్టుబడిన వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసి వ్యాన్ ను స్థానిక ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుల్, సుధీర్, వెంకటేశ్, ఉపేందర్ పాల్గొన్నారు.