ఖమ్మం ఐటీ హబ్  ఫేజ్–2 పనులు మొదలు పెడ్తలె

ఖమ్మం ఐటీ హబ్  ఫేజ్–2 పనులు మొదలు పెడ్తలె
  •     కేటీఆర్​ పునాదిరాయి వేసి రెండేళ్లు పూర్తి
  •     రూ.36 కోట్లతో పరిపాలనా అనుమతులు
  •     వెంటనే ప్రారంభిస్తామన్న ఐటీ మంత్రి
  •     టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్న మంత్రి పువ్వాడ

ఖమ్మం, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్​ఫేజ్–2 నిర్మాణ పనులు మొదలు కావడం లేదు. దీనికి రెండున్నరేళ్ల క్రితమే రూ.36 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఆ తర్వాత ఆర్నెళ్లకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, భూమిపూజ చేశారు. అయినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లు మారింది. ఫేజ్–-2 నిర్మాణం కోసమే ప్రస్తుతం ఐటీ హబ్​ప్రాంగణాన్ని ఆనుకొని ఉన్న రైతు బజార్ ను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అక్కడికి సమీపంలోనే ఇంటిగ్రేటెడ్​వెజ్ అండ్​నాన్ వెజ్​మార్కెట్​ను కొత్తగా నిర్మించి అక్కడికి రైతు బజార్​ను తరలించారు. ఇది జరిగి కూడా దాదాపు ఆర్నెళ్లు అవుతోంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలక్షన్​కోడ్ రాకముందే పనులు ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పూర్తయితే మరో 30 కంపెనీల రాక...

ఖమ్మం ఐటీ హబ్ ను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​2020 డిసెంబర్7న ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 19 కంపెనీలు వర్క్​చేస్తున్నాయి. వీటిలో మూడు షిఫ్టుల్లో కలిపి దాదాపు1100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫేజ్–1 ప్రారంభించిన రోజే జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్​మాట్లాడుతూ తక్షణమే రెండో దశ భవన నిర్మాణం కోసం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి కొనసాగింపుగా 2021 మార్చి 15న ఫేజ్–2 పనులకు ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. ఖర్చు అంచనాలను పెంచి రూ.36 కోట్లతో 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డింగ్ నిర్మాణం కోసం పరిపాలనా అనుమతులను కూడా మంజూరు చేసింది. ఇందులో ఒకేసారి 550 మంది పనిచేసేలా, మూడు షిఫ్టుల్లో కనీసం1500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అదే ఏడాది ఏప్రిల్ 2న ఫేజ్–2 నిర్మాణానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ తో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే మరో 30 కంపెనీలు పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే ముందుకు వచ్చాయి. జిల్లా నుంచి వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు, కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి 
చూపిస్తున్నారు. 

త్వరలోనే పనులు ప్రారంభం..

ప్రస్తుతం ఉన్న ఐటీ హబ్ ను ఆనుకొని సర్దార్​పటేల్ స్టేడియం వైపు గతంలో రైతు బజార్ ఉంది. కాగా ఫేజ్–2లో భాగంగా బిల్డింగ్ నిర్మాణం కోసం స్థలం సరిపోదనే ఆలోచనతో రైతు బజార్​ను ఖాళీ చేయించారు. రైతు బజార్ లోని వ్యాపారులను ఇంటిగ్రేటెడ్​వెజ్​అండ్​నాన్ వెజ్ మార్కెట్ కు తరలించారు. గత ఆర్నెళ్లుగా స్థలం అందుబాటులోకి వచ్చినా, ఇంకా ఫేజ్–2 పనులు ప్రారంభమే కాలేదు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్​ను వివరణ కోరగా ఈ మధ్యనే ఫేజ్–2 కోసం టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందని, త్వరలోనే వర్క్​స్టార్ట్ అవుతుందని చెప్పారు.