- గొల్లపాడు నుంచి ప్రకాశ్ నగర్ వరకు పనులు
- ధంసలాపురం దాటించాలని కొత్తగా ప్లాన్
- బోనకల్ రోడ్డు, దేవరపల్లి హైవే కారణంగా ఇబ్బందులు
- మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న జిల్లా ఆఫీసర్లు
ఖమ్మం, వెలుగు : మున్నేరు నదికి ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పొడిగింపుపై టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా సర్వే చేస్తున్న ఆఫీసర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై మంత్రి తుమ్మలకు నివేదిక అందించడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా ఆఫీసర్లు భావిస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు నుంచి ఖమ్మం సిటీ ప్రకాశ్నగర్వరకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
రూ.690 కోట్లతో నదికి ఇరువైపులా 17 కిలోమీటర్ల మేర వాల్ నిర్మిస్తున్నారు. అయితే ప్రకాశ్నగర్నుంచి దిగువన ధంసలాపురం వరకు వాల్ ను పొడిగించేందుకు ప్రపోజ ల్స్ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గతేడాది భారీ వర్షాల సమయంలో ఎక్కడి వరకు డ్యామేజీ అయిందో, అలాంటి డ్యామేజీ మళ్లీ జరగకుండా అక్కడిదాకా రిటైనింగ్ వాల్ ఉండాలని ఆఫీసర్లకు మంత్రి సూచించారు. దీంతో అధికారులు ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నారు.
సమస్య ఎక్కడ వస్తుందంటే !
ప్రకాశ్నగర్నుంచి ధంసలాపురం వరకు కొద్ది రోజులుగా ఇరిగేషన్ఆఫీసర్లు డీజీపీఎస్సర్వే చేస్తున్నారు. ఒక్కోవైపు 4 కిలోమీటర్ల చొప్పున 8 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ పొడిగించాల్సి ఉంటుందనిభావించారు. ఓ వైపు 6.3 కిలోమీటర్లుగా నిర్ధారణకు వచ్చారు. దీంతో రెండు వైపులా కలిపి మొత్తంగా 12.6 కి.మీ కానుంది. అయితే రిటైనింగ్ వాల్ చివరి వరకు డ్రెయిన్లు నిర్మించేందుకు తగిన పరిస్థితులు లేకపోవడం, ఇంకా దిగువ వరకు వాల్ ను పొడిగించేందుకు ఖమ్మం, బోనకల్రోడ్డు అడ్డుగా ఉండడం, దాని పక్కనే ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అడ్డురావడం, రైల్వే ట్రాక్ఉండడం వంటివి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అడ్డంకిగా మారుతున్నాయి.
ప్రస్తుతం నిర్మిస్తోన్న రిటైనింగ్ వాల్ కు డ్రెయిన్ల డిజైనింగ్ కు ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి అప్రూవల్స్రాలేదు. ధంసలాపురం వద్ద మున్నేరులో మరిన్ని డ్రెయిన్లు, నాలాలు, ఖానాపురం, ధంసలాపురం చెరువు నుంచి వచ్చే అలుగు నీళ్లు కలుస్తాయి. వాటిని మళ్లించేందుకు తగిన విధంగా రిటైనింగ్ వాల్ పక్కన డ్రెయిన్లను డిజైన్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రాక్టికల్ గా అక్కడి వరకు వాల్ ను పొడిగించేందుకు ఉన్న ఇబ్బందులను మంత్రి తుమ్మల దృష్టికి తీసుకెళ్లాలని ఆఫీసర్లు భావిస్తున్నారు.
ప్రస్తుత పనుల తీరు ఇదీ!
మున్నేరు వరదతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రస్తుతం రీ ఇన్ఫోర్సుడ్ సిమెంట్ కాంక్రీట్(ఆర్సీసీ) వాల్ మున్నేరుకు ఇరువైపులా నిర్మిస్తున్నారు. నది మధ్య నుంచి రెండు వైపులా 115 మీటర్ల చొప్పున దూరం ఉంటూ, కనీస ఎత్తు 6 మీటర్ల నుంచి గరిష్టంగా 11 మీటర్ల వరకు(33 ఫీట్ల ఎత్తు)లో రిటైనింగ్ వాల్ డిజైన్ చేశారు. ధంసలాపురం వద్ద రెయిన్వాటర్, డ్రెయిన్వాటర్ నదిలో కలిసేలా రూపొందించారు.
ముందుగా రూ.980 కోట్లతో కాంక్రీట్ డ్రెయిన్స్ ను కలిపి ప్రతిపాదనలను తయారు చేయగా.. బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని కాంక్రీట్ డ్రెయిన్స్ను ప్లాన్లోంచి తొలగించారు. దీంతో బడ్జెట్ రూ.690 కోట్లకు తగ్గింది. తాజాగా డ్రెయిన్స్ డిజైన్లు ఫైనలైజ్ దశలో ఉన్నాయి. రెండు వైపులా 8.5 కి.మీ మేరకుగాను ఇప్పటివరకు 3 కి.మీ చొప్పున నిర్మాణాలు పూర్తై, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. డీజీపీఎస్ ద్వారా సర్వే పూర్తి కోసం మరికొంత సమయం పడుతుందని, ఆ తర్వాత డిజైన్లను సిద్ధం చేసే చాన్స్ ఉందని ఇరిగేషన్ఆఫీసర్లు చెబుతున్నారు. అదనంగా 12 కి.మీ మేర రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి వస్తే ప్రాజెక్టు ఖర్చు రూ.1,500 కోట్ల వరకు పెరగవచ్చని తెలిసింది.
